కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రం గాల్లో నిర్వీర్యమైందని, ముఖ్యంగా నేరాల్లో ఏకంగా నంబర్ వన్‌గా నిలిచే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనలో గాయపడి వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. వారి కుటుం బ సభ్యులతో మాట్లాడి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జ్యోతినగర్‌లోని పీఎంజే నగల దుకాణాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని గుర్తుచేశారు. ఐదుగురు ముష్కరులు తుపాకులతో దుకాణంలోకి వచ్చి కాల్పులు జరిపి, దాదాపు నాలుగైదు కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లిన తీరు ప్రభుత్వం, పోలీసు నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని విమర్శించారు.
ఘటన జరిగి 32 గంటలైనా ఒక్కరిని కూడా పట్టుకోలేదంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నదో అర్థం చేసుకోవచ్చని వాపోయారు. ఐదుగురు దొంగ లు ఉదయం 11 గంటలకే పిస్తోళ్లు పట్టుకొని మాస్కులు కూడా లేకుండా నగల దుకాణం లో చొరబడి హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపిన తీరు చూస్తే వారికి ఇక్కడి పోలీస్ వ్యవస్థపై ఏమాత్రం భయం లేదన్న విషయం తెలిసిపోతున్నదని, సిబ్బంది చనిపోయినట్టు భావించి ఆ ముష్కరులు పారిపోయారే తప్ప పోలీసులు, ప్రభుత్వాన్ని చూసి కాదని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంటే కాంగ్రెస్ పాలనలో మొత్తం గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు సేఫ్టీ సిటీగా కరీంనగర్‌ను చేయాలన్న లక్ష్యంతో 769 సీసీ కెమెరాలు పెట్టించామని, కమలాకర్ స్థానిక ప్రజలను చైతన్యం చేసి.. వెయ్యికి పైగా కెమెరాలు పెట్టించారని గుర్తుచేశారు.
గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నరా?
కేసీఆర్ అధికారంలోకి రాగానే శాంతిభద్రతల పరిరక్షణకు తొలిప్రాధాన్యం ఇచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు అధునాతన వా హనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చేందుకు రూ.350 కోట్లకు జీవో ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంటర్ సెక్టర్ వాహనాలు అందుబాటులోకి వచ్చి దొంగతనం చేయాలంటేనే దొంగలు భయపడే పరిస్థితి నాడు ఉండేదని తెలిపారు. నేడు రాష్ట్రం లో పరిస్థితి దారుణంగా దిగజారిందని, పట్టపగలు ఐదు తుపాకులతో దుండగులు సంచరిస్తుంటే పోలీసులు గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలు కాపాడండి
ఘటన జరిగిన నగల దుకాణం పక్కనే కో ర్టు ఉన్నదని, ఆ పక్కనే కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి కార్యాలయం కూడా ఉన్నదని, అక్కడ వందలమంది పోలీసులు ఉంటారని, ఇంత మంది ఉండీ ఏం చేశారని కేటీఆర్ ప్ర శ్నించారు. కేసీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారని, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడే కూర్చుంటున్నాడని, కమాండ్ క్ంర టోల్ సెంటర్లో కూర్చోవడం కాదని, శాంతి భద్రతల విషయంలో కమాండ్ పెంచుకోవాలని హితవు పలికారు. ‘మా ఫోన్లు హ్యాక్ చే యడం, మా సీసీ కెమెరాలను హ్యాక్ చేయ డం, మమ్మల్ని వెంటపడి వేధించడం కాదు.. చేతనైతే ప్రజల ప్రాణాలు కాపాడండి’ అని సూచించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నా..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో తుపాకులతో ముష్కరులు వచ్చి కాల్పు లు జరిపినా ఒక్కరినీ పట్టుకోలేక పోవడం దారుణమని కేటీఆర్ వాపోయారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒక చిన్నారిని అపహరిస్తే ఐదారు గంటల్లోనే పాపను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించామని గుర్తుచేశారు.
ముగ్గురు మంత్రుల్లో ఒక్కరూ రాలే
‘ఇంత పెద్ద ఘటన జరిగితే రాష్ట్రం నుంచి ఒక్క పెద్దనాయకుడైనా వచ్చారా? ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒక్కరైనా వచ్చారా?’ అని కేటీఆర్ పశ్నించారు. ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉన్నదో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
బండీ..ఎవెక్యూ ప్రాపర్టీ కోసమేనా?
‘దోపిడీ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు కదా?’ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన ఈ ఘటన గురించి మాట్లాడితే రాష్ట్ర హోంశాఖను విమర్శించాలి. ఇది పరిపాలనా వైఫల్యమని హోంశాఖ మంత్రిని ప్రశ్నించాలి. కానీ బండి సంజయ్ పొరపాటున కూడా రేవంత్‌రెడ్డిని ఒక్క మాటా అనడు. రేవంత్‌రెడ్డిని అనాలంటే ఎందుకంత భయపడుతున్నడు’ అని ప్రశ్నించారు. ‘కాందిశీకుల భూ ముల్లో కలిసి పని చేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయనా?’ అని నిలదీశా రు. ‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆ యన ఎవరికి సహాయం చేస్తున్నారో తెలుసు.
సమయాన్ని బట్టి అన్నీ బయటకు వస్తయ్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవెక్యూ ప్రాపర్టీ భూముల విషయంలో ఉన్న ఆసక్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎం దుకు లేదో బండి సంజయ్‌ని చెప్పుమనండి’ అని చురకలంటించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు, రాష్ట్ర నాయకులు తుల ఉమ్మ, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, రాష్ట్ర నాయకుడు రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.
కేటీఆర్ సమక్షంలో చేరికలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో 10వ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణణి, నాగరాజు దంపతులు సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారితో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు చేరగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కేటీఆర్ మాటలతో ఉలిక్కిపడ్డ బండి..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఐదుగురు ముష్కరులు తుపాకులతో పట్టపగలు నగల దుకాణంలో దోపిడీ చేసి నలుగురిని గాయపరిస్తే బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని, దీని వెనుక ఉన్న వ్యవహారం త్వరలోనే బయటకు వస్తదని కేటీఆర్ చేసిన విమర్శలతో బండి ఉలిక్కిపడ్డారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ ముగిసిన గంటలోనే బండి సంజయ్ హడావుడిగా కరీంగనర్‌లోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ లూటర్’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణ సొమ్మును దోచుకొని కేరళ ఎన్నికల్లో ఖర్చు చేశారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి గేమ్ ఛేంజర్ అయితే.. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాంలోనూ ప్రచా రం చేశారు కదా? అక్కడెందుకు గెలువలేదు?’ అని ప్రశ్నించారు. కానీ నగల దుకాణం దోపిడీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. సోమవారం ఉదయమే బాధితులను పరామర్శించిన సంజయ్ ఆ సమయంలోనూ మీడియాతో మాట్లాడిన సందర్భంలో రేవంత్‌రెడ్డిని గానీ, ప్రభుత్వ, పోలీసుల వైఫల్యంపైగానీ ఏమీ మాట్లాడలేదు. తీరా కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత ఎట్టకేలకు రేవంత్‌రెడ్డిని విమర్శించారు గానీ, పీఎంజే ఘటన విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవడం గమనార్హం.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం చేతనవుతుందా? లేదా? రేవంత్ సర్కార్ చెప్పాలె. ఒకవేళ చేతకాదంటే ప్రజలకు మేమే విజ్ఞప్తి చేస్తం. ఎవరి ఇంటి ముందు వారే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్తం. ఎవరికి వారే ఇంటి ముందు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలని కోరుతం. ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తం.
– కేటీఆర్