పరకాల, జూలై 26 : అధికార అండతో కొందరు కాంగ్రెస్ నాయకులు జెండా గద్దెపై కుటిల రాజకీయం చేస్తున్నారు. పరకాల నియోజకర్గం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మించిన బీఆర్ఎస్ జెండా గద్దెకు అనుమతి లేదంటూ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేశారు. ఆదివారం కేటీఆర్ పరకాల పర్యటన నేపథ్యంలో ముందుగా పోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు శనివారం జెండా గద్దె నిర్మించారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో స్థానిక పంచాయతీ కార్యదర్శి బీఆర్ఎస్ జెండాగద్దె తీసేవేయాలని బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పల్లెబోయిన రాజుకు నోటీసులు అందించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు పక్కన జెండా గద్దెను అక్రమంగా నిర్మించారని, నోటీసు అందిన వెంటనే సదరు జెండా గద్దెను తీసివేయాలని, లేనిపక్షంలో 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు తమ జెండాల ఆవిష్కరణకు గద్దెలను నిర్మించుకోవడం సహజమేనని, ఇలా నోటీసులు జారీచేయడం వెనక ఉన్న మతలబు అందరికీ తెలసునని స్థానికులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జెండా గద్దె కట్టిందే తడవుగా అక్రమ నిర్మాణమంటూ నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శికి గ్రామ ముఖ్య కూడలిలో సైడ్ డ్రైన్‌పై నిర్మించిన టీడీపీ జెండా గద్దె విషయం తెలియకపోవడంలో ఆంతర్యమేమిటని పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా.. నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమేనని, నాలుగేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఈ సమయంలో ఏ పార్టీ నాయకులు జెండా గద్దెను నిర్మించుకోలేదని, బీఆర్ఎస్ జెండా గద్దెకు అనుమతి తీసుకోకుండా అక్రమంగా కట్టడంవల్లే నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. టీడీపీ జెండా గద్ద్దెకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదనడం కొసమెరుపు.
అభివృద్ధి చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నది. కుటిల రాజకీయాలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. సీనియర్ నాయకుడినని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యేకు జెండా గద్దెల విషయంలో కనీస అవగాహన లేకపోవడం ఆయన పనితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే కార్యదర్శి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష హోదాలో తాము ప్రజల పక్షాన నిలబడడంతోపాటు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.
-చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరకాల
కృష్ణకాలనీ, జూలై 26 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట లో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహ ఆవిషరణ, మధ్యాహ్నం 12 గంటలకు మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీసాయి గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం మొగుళ్లపల్లి, నవాబుపేట, చిట్యాల, జడలపేట, ఒడితల, దూత్‌పల్లి, భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి, మోరంచపల్లి, గణపురం మండలంలోని చెల్పూర్ మీదుగా భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని గండ్ర దంపతులు పేర్కొన్నారు.