జూబ్లీహిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలి. అప్పుడే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని గల్లాపట్టి నిలదీస్తాం.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటేస్తే బస్తీల్లోకి బుల్డోజర్ రావడం, పేదల ఇండ్లు కూల్చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మోకా ఇస్తే ధోకా చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. జూ బ్లీహిల్స్ నియోజకవర్గంలోని 4లక్షల మంది ఇచ్చే తీర్పు కోసం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. నవంబర్ 14 తర్వాత రాష్ట్రంలో కొత్త తుపాన్ రావడం, 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ గద్దెనెక్కడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన వికాసం, రెండేండ్ల రేవంత్ సర్కారు హయాంలో జరిగిన విధ్వంసానికి మధ్య పోటీ జరుగుతున్నదని అన్నారు. ప్రజలు అభివృద్ధివైపు నిలుస్తారో, దగా చేసిన వారికి అండగా నిలుస్తారో తేల్చుకోవాలని విజ్ఞప్తిచేశారు.

ఆలోచించి కారుకు ఓటేసి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని కోరారు. ఓటుతో మోసపూరిత హస్తం పార్టీకి దెబ్బకొడితేనే 6గ్యారెంటీలు, మహిళలకు ప్రతినెలా రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్లు, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం వస్తాయని అన్నారు. పొరపాటు చేస్తే మరో మూడేండ్లు నరకం అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దని కోరారు. శనివారం ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియోలు ప్రదర్శిస్తూ రేవంత్‌రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎర్రగడ్డ డివిజన్ వాసుల ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌కు 16 వేల మెజార్టీని కట్టబెట్టారని, ఇప్పుడు అంతకుమించి అధిక్యాన్ని ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి రెండేండ్లలో ఎంతమందిని కోటీశ్వరులను చేసిండో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కానీ, వారు రాత్రింబవళ్లు శ్ర మించి బిడ్డల పెండ్లిళ్ల కోసం కొనుక్కున్న చిన్న ప్లాట్లకు ధరల్లేకుండా చేశారని తూర్పారబట్టారు. పేదల నివాసాలపైకి బుల్డోజర్లను పంపి వారి బతుకులను రోడ్డుపాల్జేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో కళకళలాడిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు చేవచచ్చిన రేవంత్ పాలనలో కుదేలైందని విమర్శించారు. పుట్టిన పిల్లగాడి నుంచి చావుకు దగ్గరైన వృద్ధుల వరకు మోసం చేసిన నీచపు చరిత్ర రేవంత్‌రెడ్డి సొంతమని విమర్శించారు. కేసీఆర్ తెచ్చిన బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను బంద్‌పెట్టి అన్ని వర్గాలను దగా చేసిన ఘనత ఆయనకే దక్కిందని ధ్వజమెత్తారు.

చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పి తీసుకొచ్చిన హైడ్రా పేదల ఇండ్లపై ప్రతాపం చూపుతూ పెద్దోళ్ల నివాసాలను వదిలివేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జాపెట్టిన 11 ఎకరాలకు రేకులు వేసి కాపాడుతుందని విమర్శించారు. ప్రజలు గమనించి దగాచేసిన పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పాలని విజ్ఞప్తిచేశారు. ‘పొరపాటున చెయ్యి గుర్తుకు ఓటేస్తే మహిళలకు రూ. 2,500 ఇవ్వకపోయినా, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వకున్నా, రైతుబంధు ఎగ్గొట్టినా, పింఛన్లు పెంచకున్నా ప్రజలు తమనే ఆదరిస్తున్నారని రేవంత్‌రెడ్డి అనుకొనే ప్రమాదం ఉన్నది’ అని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి ఒక్క చాన్స్ ఇస్తే అన్నివర్గాలను ఆగం చేశారని, అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్‌ను బర్బాద్ చేశారని ధ్వజమెత్తారు. ‘ఒక్కసారి అవకాశమిచ్చినందుకే దళిత, గిరిజన బంధులను ఎగ్గొట్టారు. బీసీబంధు ఎత్తేశారు. కేసీఆర్ కిట్‌ను బంద్ చేశారు. గొర్రెలు, చేపపిల్లల పంపిణీ పథకాలకు మంగళం పాడారు. రెండేండ్లలో ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డికి మరో చాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలని కోరారు. అప్పుడే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని గల్లాపట్టి నిలదీస్తామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. లేకుంటే కత్తి కాంగ్రెస్‌కు ఇచ్చి కేసీఆర్‌ను యద్ధం చేయాలంటే కుదరదనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

జూబ్లీహిల్స్‌లో ప్రజలను బెదిరిస్తున్న ఆకు రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ ధైర్యం చెప్పారు. గెలిచిన వెంటనే కాంగ్రెస్‌కు తొత్తులుగా మారి ఎగిరెగిరి పడుతున్న పోలీసుల తోకలు కత్తిరిస్తామని తేల్చిచెప్పారు. రౌడీల అంతుచూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కాపాడబోరని ప్రకటించారు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలన సృష్టించిన అద్భుతాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, కట్టిన ఫ్లైఓవర్లు కండ్లముందే కదలాడుతున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. రెండేండ్ల రేవంత్ పాలనలో హైడ్రా విధ్వంసం, చేసిన దందాలు మీకు తెలిసిందేనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని, విజ్ఞతతో వ్యవహరించి సునీతమ్మను గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ను తిరిగి సీఎంగా చేసుకొని ప్రగతిని పట్టాలెక్కించుకోవాలని పిలుపునిచ్చారు.
పైనుంచి మూడో నంబర్ కారు గుర్తు అని కేటీఆర్ తెలిపారు. ప్రజలు పొరపాటు చేయవద్దని సూచించారు. సునీతమ్మను చూసి మూడో నంబర్‌పై బటన్ నొక్కి లైట్ వెలిగిస్తే రేవంత్‌రెడ్డి ఇంట్లో కరెంట్ బంద్ అవుతుందని చమత్కరించారు. నవంబర్ 14న బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని పునరుద్ఘాటించారు.

కేసీఆర్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. ఆయన జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ‘పెద్దోళ్ల పింఛన్లను రూ. 2000కు పెంచారు. పెండ్లి చేసుకున్న 15 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. లక్ష చొప్పున కట్నం పెట్టారు. పురుడు పోసుకున్న లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్లు ఇచ్చి గౌరవించారు. అంబులెన్స్‌ల్లో సురక్షితంగా ఇం డ్లకు పంపించారు.
హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు నిర్మించారు. జీవో 58, 59ని తెచ్చి 1.14 లక్షల మంది గరీబోళ్లకు పట్టాలు ఇప్పించారు. ఐటీని అభివృద్ధి చేసి 6 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. 2014లో 57 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను 2.41లక్షల కోట్లకు పెంచారు. ఎవరికైనా సుస్తీ చేస్తే 350 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చా రు. రూ.5 భోజనంతో పేదల కడుపు నింపా రు. డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టారు. మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి నిరుపేద పిల్లలకు మెరుగైన విద్యనందించారు’ అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం కేసీఆర్ పథకాలను నిలిపివేయడం తప్ప చేసింది శూన్యమని నిప్పులు చెరిగారు. వాళ్లు తులం బంగారం ఇచ్చేవాళ్లు కాదని మహిళల మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లేవారని చురకలంటించారు.
జూబ్లీహిల్స్‌లో ప్రజలను బెదిరిస్తున్న ఆకు రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదు. గెలిచిన వెంటనే కాంగ్రెస్‌కు తొత్తులుగా మారి ఎగిరెగిరి పడుతున్న పోలీసుల తోకలు కత్తిరిస్తాం. రౌడీల అంతుచూస్తాం. వారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కాపాడలేరు.
-కేటీఆర్
ఇక్కడికి తరలివచ్చిన వేలాదిమందిని చూస్తుంటే గోపన్న ఎంతమంది గుండెల్లో గుడికట్టుకున్నారో గుర్తుకు వస్తున్నదని జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ఆయన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడేవారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా కారుకు ఓటేసి తనను గెలిపిస్తే అర్ధరాత్రి కాల్చేసినా స్పందించి ఆదుకునేందుకు ముందుకొస్తానని ప్రకటించా రు.
రాజకీయాల కోసం తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని, నియోజకవర్గమే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరెన్ని కు ట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందని, నియోజకవర్గ ప్రజలు ఈ కుట్రలను గమనించాలని కోరారు. రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్సీ సలీం, బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, ఎమ్మెల్యేలు మా ధవవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డివిజన్ల ఇన్చార్జులు రాగిడి లక్ష్మారెడ్డి, భూపాల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, చంటి, క్రాంతికిరణ్, ఆదర్శరెడ్డి, రాజనర్సు, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా కాంగ్రెస్ పార్టీ నోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. షేక్‌పేటలో రూ. 5వేలు, బోరబండలో రూ. 5వేలు, యూసుఫ్‌గూడలో రూ. 8 వేల చొప్పున పంచిపెడుతూ దొడ్డిదారిన గెలిచేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. చైతన్యవంతులైన జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ వాళ్ల దోపిడీ సొమ్మును తీసుకోవడమే కాదు, రెండేండ్లలో కాంగ్రెస్ సర్కారు మహిళలకు బాకీ పడ్డ రూ. 60 వేలు, వృద్ధులకు రూ. 48వేలు, ఆటో డ్రైవర్లు రూ. 24 వేలు ఎక్కడికి పోయాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు ఇచ్చే నోట్ల కట్టలను తీసుకొని కారు గుర్తుకు ఓటేసి తమకోసం పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు.