KTR | రాజన్న సిరిసిల్ల : 20 నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
మీ అందరిలో ఒకడిగా ఉంటాను. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు మంచిరోజులు రాబోతున్నయి. ఇప్పుడు ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలి. బూత్ స్థాయిలో మెజారిటీ తీసుకురావాలి. ఎంత పెద్ద నాయకుడైన ఊర్లో మెజారిటీ తీసుకురావాలి. చినుకు చినుకు కలిసి వరద అయినట్లు ప్రతి ఒక్క ఓటును రాబట్టుకోవాలి. పోయిన కాడనే వెతుక్కోవాలి.. మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే ప్రతి సీటు గెలవాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
గత పదేళ్ళలో ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేశాము. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోయారు. రైతులకు కేసీఆర్ సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చారు. కార్యకర్తలందరూ కలిసి పని చేయాలి. మనం కూసున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నాము. ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి రైతు తినే పళ్ళెంలో మట్టి పోసుకున్నామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు. రైతుబంధు రాదు, రైతు బీమా రాదు, బోనస్ రాదు. కానీ ఓట్లు ఉన్నప్పుడే నోట్లు వేస్తున్నాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని మభ్యపెట్టారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీ పోయి ధర్నా చేస్తామంటున్నారు.. కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీస్తామంటున్నారు. సీఎం చేతిలో ఉన్న పనులు చేయడం లేదు. రేవంత్ రెడ్డిని తిడితే.. బండి సంజయ్‌కి ఏం నొప్పి. తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేయాలి… గోదావరి నీళ్లు ఆంధ్రకు వదిలేయాలి.. అనేది బండి సంజయ్, రేవంత్ రెడ్డి గూడుపుటాని. కేసీఆర్ ఉంటే నీళ్లు, నిధులు ఎవరికి పోనియ్యడనే దురుద్దేశ్యంతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుట్రలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
కులం,మతం ముసుగులో మళ్ళీ మోసపోవద్దు. మహిళలకు 2500లు అన్నాడు హామీ ఏమైంది… ఒక్కో మహిళకు రేవంత్ రెడ్డి 50వేలు బాకీ ఉన్నాడు. ఆసరా పెన్షన్లు 4వేలు ఏమైంది. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను నిరుద్యోగ యువత అశోక్ నగర్లో కొట్టుడు ఒకటే తక్కువ. ఆనాడు చంద్రబాబు, వైఎస్, రోశయ్యల, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారు. సీఎం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి పీకిందేమి లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారు. సీఎం తిట్టుడు బంద్ చేస్తే నేను తిట్టుడు బంద్ చేస్తా. సీఎం దిక్కుమాలిన పనులు చేస్తున్నాడు. ప్రజలు నమ్మి మోసపోయారు. ప్రజలు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కడితే మళ్లీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. కార్యకర్తలు బేషజాలకు వెళ్లొద్దు అని కేటీఆర్ సూచించారు.