KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ఉచిత బస్సు పథకంతో ఆటో నడవక, ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరిసిల్ల నియోజకవర్గం, అడవి పదిరకు చెందిన ఆటో డ్రైవర్ సతీశ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరితో ఉపాధి లేక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలతో కొట్టుమిట్టాడుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే 93 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.. చనిపోయిన ప్రతి ఆటో కార్మికుని కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కి రూ. 24 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలన్నీ, డ్రైవర్లందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంది. కష్టం వచ్చిన ఆటో డ్రైవర్ అన్నల వెంబటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.