KTR | జర్నలిస్టులను అవమానించానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. జర్నలిస్ట్ లు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని.. వారంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. జర్నలిస్టులను నేను అవమానించానని అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని వ్యాఖ్యానించారు.
మా కళ్ల ముందే మూసీ పేరుతో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించవద్దా అని కేటీఆర్ నిలదీశారు. మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే అని స్పష్టం చేశారు. వానాకాలం రైతు భరోసాకు పైసలు లేవు కానీ మూసీలో రూ. లక్షా 50 వేల కోట్లు పోయటానికి డబ్బులున్నాయా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు పైన దామగుండంలో, ఇటు కింద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చి మూసీని సంపుతావ్. మళ్లీ మూసీ పునరుజ్జీవనం అంటే ఎలా నమ్మేదని మండిపడ్డారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే నేను మాట్లాడవద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంతూరులో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగితే మిగతా జర్నలిస్టులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉస్మానియాలో ఒక జర్నలిస్టు పై, శంకర్ అనే జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఎందుకు జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడలేదని అన్నారు. జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవముందని. భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు..
మూసీ లూటీని కవరప్ చేసేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ విషయంలో ఎలాంటి లూటీ జరిగిన మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడిపోతున్నాడని.. పొంగులేటి ఇంటి మీద రైడ్ జరిగి 20 రోజులైనా ఎవరూ మాట్లాడారని విమర్శించారు. కర్ణాటకలో మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని సిద్ధరామయ్య అంటాడు… కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ రహస్య స్నేహం కొనసాగుతుందని విమర్శించారు.
కర్ణాటకలో జరిగిన అంత పెద్ద వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంటే ఇప్పటివరకు ఎందుకు ఒక్క అరెస్టు జరగలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ స్కాం లో సీఎం బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి చేస్తున్నారని నేను కేంద్రమంత్రికి లేఖ రాసిన ఇప్పటికీ స్పందించలేదని తెలిపారు. ఎవరికీ ఎవరు దోస్తులో ప్రజలకు అన్ని తెలుసని అన్నారు. అవసరమైనప్పుడు అన్ని బయటపడుతాయని తెలిపారు.
బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్క మత ఘర్షణల సంఘటన కూడా జరగలేదని కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సంఘటనపై ఖండిస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని నా మీద సైబర్ క్రైమ్ వాళ్లు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. మత ఘర్షణల సంఘటనపై కూడా మేము ఖండన చెప్పవద్దా అని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రికి చేతనైతే శాంతి భద్రతలను కాపాడాలి. కానీ మా సోషల్ మీడియాను ఏదో చేయాలని ప్రయత్నించటం అరాచకమని విమర్శించారు.
బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటు అని కేటీఆర్ అన్నారు. మేము లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్లకు మీ ప్రభుత్వ జీతాలు ఇస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇన్ని అబద్దాలు మాట్లాడేందుకు సిగ్గు కూడా లేదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడని.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకొని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడూ నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గతేడాది అక్టోబర్‌లో అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విద్యార్థులకు నమ్మబలికారని కేటీఆర్ గుర్తుచేశారు. దాదాపు ఏడాది పూర్తయ్యిందని.. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు అశోక్ నగర్‌కు రావాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అశోక్‌నగర్‌కు వస్తే వాళ్లకు విద్యార్థులు సన్మానం చేస్తారని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళితే సెక్యూరిటీ ఇచ్చి తాము పంపించామని.. కానీ ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటూనే అరెస్ట్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పాలనకు తమ పాలనకు అదే తేడా అని స్పష్టం చేశారు.