‘హింసించే పులకేశి’లాగా ఇంకా రెండేండ్లు రేవంత్‌ను భరించాలె. రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే. రేవంత్.. ఎంతమంది దేవుండ్లకు మొక్కుతవో మొక్కుకో! పాతాళంలో దాక్కున్నా సరే వదలం. ఇక నీకు ఉంటుంది! కేసీఆర్‌ను, కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టం.-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 9(నమస్తేతెలంగాణ): గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు లు.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ప్రచార హోరు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీల బాధ్యతలు.. క్యాడర్లో పట్టుదల, తపన.. వెరసి రాష్ట్రవ్యాప్త మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తున్నది. పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తారని సంకేతాలు అందుతున్నా యి. దీంతో బల్దియాలపై గులాబీ జెండాను ఎగురవేసే లక్ష్యంతో పార్టీ దూసుకెళ్తున్నది. మరో 24 గంటల్లో పోలింగ్ జరుగనున్న తరుణంలో రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకొనే దిశగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో త్రిముఖ వ్యూహాన్ని అమలుచేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రచార రంగంలోకి దింపింది. అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలకు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కిందిస్థాయి క్యాడర్‌ను సైతం వెన్నుతట్టి గడపగడపకూ పంపి ప్రచారపర్వంలో ఇప్పటికే పైచేయి సాధించింది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్ఫూర్తి
నిరుడు డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. 12 వేలకు పైచిలుకు పంచాయతీలకు గానూ దాదాపు మూడో వంతు (సుమారు 4000) స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ప్రస్తుతం ఇదే స్ఫూర్తితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను సైతం సవాల్‌గా తీసుకున్నది. షెడ్యూల్‌కు ముందు నుంచే ఎన్నికల సన్నాహాకాలు మొదలు పెట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలకనేతలతో సమావేశం నిర్వహించారు. గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహరచనను సిద్ధంచేశారు. గులాబీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగా మూడంచెల కార్యాచరణను రూపొందించారు.
గెలుపు గుర్రాలకే టికెట్లు
రాష్ట్రవాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు మొత్తంగా 123 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా చోట్ల అభ్యర్థుల ఎంపిక నుంచే గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. గెలుపు గుర్రాలనే టికెట్లు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డులు, డివిజన్లు ఉండగా, 2,878 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. అందులో రెండు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. కొన్నిచోట్ల ఇబ్బందులు పెట్టిన రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకోవడంలో సఫలీకృతమైంది. వివిధ నియోజకవర్గాల్లో అసంతృప్తికి గురైన నాయకులను బుజ్జగించడంలోనూ విజయవంతమైంది. షాద్‌నగర్, సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ తదితర మున్సిపాలిటీలతో పాటు మరికొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు చేయడంలో సఫలీకృతమైంది. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి సాగుతున్నది. పలుచోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం అవగాహన కుదుర్చుకొన్నది. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ఇన్చార్జులను నియమించింది. వీరికి స్థానిక క్యాడర్‌ను సమన్వయపరిచే బాధ్యతలను అప్పగించింది.
కేటీఆర్, హరీశ్ ప్రచార హోరు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు ప్రచారాన్ని హోరెత్తించారు. వారంరోజులపాటు నగరాలు, పట్టణాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రజల్లో భరోసాను కల్పించారు. ఒక్కోరోజు 6 నుంచి 7 మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. మహిళలు, యువతతో ముఖాముఖి సమావేశాలతో ముందుకుసాగారు. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి నిజమాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి ఓటర్లతో మమేకమయ్యారు. ప్రచార ర్యాలీల్లో పాల్గొని క్యాడర్లో జోష్ నింపారు. బహిరంగసభల వేదికగా కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగట్టారు. ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన తీరును వివరించడంలో సఫలీకృతమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బట్టబయలు చేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మురికిభాషపై తనదైన శైలిలో ప్రజలను ఆలోచింపజేసేలా విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల నుంచే నాంది పలుకాలని పిలుపునిచ్చారు. మరోవైపు హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్, మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాల్లో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఓటర్లను ఆలోచింపజేశారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని ఆరోపణాస్త్రాలు సంధించారు. బీజేపీ తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు విడమరచి చెప్పారు. ఆదివారం ఒకేరోజు 15 కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొని రికార్డు సృ ష్టించారు. చివరి రోజూ కేటీఆర్ భూపాలపల్లి, పరకాల, మహబూబాద్‌లో, హరీశ్‌రా వు, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, రామాయంపేటలో జరిగిన ప్రచారసభల్లో పాల్గొన్నారు.
బాకీ కార్డులతో ఇంటింటి ప్రచారం
26 నెలల్లో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా వివరించి ఓటర్లను ఆకట్టుకున్నారు. వందరోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టిన తీరును ఎండగట్టారు. బాకీ కార్డులను ముద్రించి గడపగడపకూ పంచిపెట్టారు. మరోసారి చెయ్యి గుర్తుకు ఓటేస్తే నిండా మునగడం తప్ప ఒరిగేదేమీ ఉండదని విడమరచి చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై అప్రమత్తం చేశారు. తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపీ అభ్యర్థులకు బుద్ధిచెప్పాలని విజ్ఞప్తిచేశారు.