KTR | ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలిస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646టీఎంసీలు వినియోగించుకుందని తెలిపారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడునెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాలలను తరలిస్తుందని పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ నిలువరించడం లేదని విమర్శించారు.
నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకు పోతున్నా బోర్డుకు చలనం లేదని.. రేవంత్ సర్కార్ నోరెత్తడం లేదని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే.. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక్కొక్కొటిగా అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం గంగలో కలుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చేది వేసవి కాలమని.. తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. కేఆర్ఎంబి పరిధిలోని త్రీ మెన్ కమిటీ దిక్కులేదని విమర్శించారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నీమ్మకు నీరెత్తినట్టున్నగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. జాగో రైతున్న జాగో.. జాగో తెలంగాణ జాగో అని పిలుపునిచ్చారు.