KTR | మంత్రి పీఏ, రేవంత్‌రెడ్డి సహచరుడు కలిసి ఓ పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేసినా విచారణకు సిట్ ఉండదు. ములుగు జిల్లాలో మంత్రి పీఏ ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా కేసుల్లేవు. రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకొని హైదరాబాద్ శివార్లలో వందల కోట్ల భూకబ్జాకు పాల్పడినా విచారణ చేయరు. ఏఐసీసీ సెక్రటరీ, రేవంత్ సన్నిహితుడు సంపత్‌కుమార్ ఓ నేషనల్ హైవే కాంట్రాక్టర్‌ను మారణాయుధాలతో బెదిరించినా చర్యల్లేవ్.
-కేటీఆర్
హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీసిందని పేర్కొన్నారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ చానల్ ఒక మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర చానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు కోసం రేవంత్ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. వార్త వేసిన అసలు చానల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకని, అసలు ఈ సిట్ ఎవరిని కాపాడటానికి? లేదా ఎవరిని వేటాడటానికి? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఓవరాక్షన్‌ను ప్రజలు గమనిస్తున్నారని, మీడియా సంస్థలపై ఈ వేధింపులను ఆపకుంటే గుణపాఠం చెప్పడం ఖాయమని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
తలకు తుపాకీ పెట్టిన ఘటనపై సిట్ ఉండదా?
నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ సర్కార్‌లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకుంటున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తూ ఓ మంత్రి పీఏ, రేవంత్‌రెడ్డి సహచరుడు కలిసి ఓ పారిశ్రామికవేత్తలకు తుపాకీ పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి సిట్ ఉండదని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లాలో మంత్రి పీఏనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా సదరు ఇసుకాసురుల మీద కేసులు లేవని విమర్శించారు.
రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకొని హైదరాబాద్ శివార్లలో వందల కోట్ల భూకబ్జాకు పాల్పడితే, ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీస్ అధికారిని బదిలీ చేస్తారు కానీ, ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండదని ధ్వజమెత్తారు. ఏఐసీసీ సెక్రటరీ, రేవంత్ సన్నిహితుడు సంపత్‌కుమార్ ఓ నేషనల్ హైవే కాంట్రాక్టర్‌ను మారణాయుధాలతో బెదిరించి రూ.8 కోట్లు డిమాండ్ చేసినా ఎలాంటి చర్యల్లేవని విమర్శించారు.
అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ చానల్ ఓ మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర చానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు కోసం రేవంత్ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరం. వార్త వేసిన అసలు చానల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకు? అసలు ఈ సిట్ ఎవరిని కాపాడటానికి? ఎవరిని వేటాడటానికి?
-కేటీఆర్
ఈ ఘటనల్లో ఎందుకు మౌనం?
కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై గాని, వందల కోట్ల లికర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఓ ఐఏఎస్ అధికారిని బలిచేసిన ఉదంతంపై గాని ఎందుకు సిట్ వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాసుల కకుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లికర్ కంపెనీలకు అనుమతులిచ్చి వందల కోట్లు కొల్లగొట్టిన సామ్‌పై, 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరిట కమీషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని విమర్శించారు. కేవలం ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించేందుకు సిట్ గారడీలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.