హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాటి రోజులను మళ్లీ తెస్తామని చెప్పి మరీ కాంగ్రెస్ దాన్ని నిజం చేసిందని మండిపడ్డారు. ‘2014కి ముందు రైతులు అర్ధరాత్రి బాయికాడ కరెంటు కోసం పం డుకునే దుస్థితి.. 2025లో యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం అరుగు మీద పండుకునే దుస్థితి.. వారెవ్వా.. ఎంత గొప్ప మార్పు ఇది’ అని శనివారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్లో పెట్టి అరుగు మీద నిద్రిస్తున్న మహిళా రైతు ఫొటోను కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ముసురు వానలో రైతన్న.. మొద్దునిద్రలో సర్కారు : హరీశ్
యూరియా బస్తాల కోసం ముసురు వానలో అన్నదాతలు అవస్థలు పడుతుంటే రేవంత్ సర్కారు మొద్దునిద్రలో జోగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు కలవరపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం కాదు.. రైతన్నల పాలిట భస్మాసుర హస్తం అయ్యిందని శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం ముసురు వానలో రైతులు పడుతున్న అవస్థను తెలిపే వీడియోను ఎక్స్‌లో పోస్టుచేశారు.