KTR | రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానం ఎక్కడానికి, దిగడానికే ముఖ్యమంత్రికి సరిపోతుందని ఎద్దేవా చేశారు.
పల్లెలేమో నిధుల్లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయని.. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా విడుదల చేయకుండా గ్రామాలను గబ్బు పట్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. పంచాయతీల్లో పాలన గాడితప్పిందని అన్నారు. పారిశుద్ధ్యం పడకేసిందని, ప్రజలు రోగాల పాలవుతున్నారని విమర్శించారు. ట్రాక్టర్లకు డీజిల్ లేదని, కార్మికులకు వేతనాల్లేవని, 8 నెలలుగా అంతా అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. నిన్న ప్రగతి మల్లెలై విరిసిన పల్లెల్లకు.. నేడు పైసలు గతిలేని పరిస్థితి దాపురిచిందని అన్నారు. ఈ మేరకు పల్లె గల్లా.. ఖాళీ అనే శీర్షికతో ప్రముఖ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్త క్లిప్‌ను కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు.
ఢిల్లీ విమానం ఎక్కడం..దిగడమే సరిపోతున్నది ముఖ్యమంత్రికి..!
పల్లెలేమో నిధుల్లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయి..!
ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా విడుదల చేయకుండా గ్రామాలను గబ్బుపట్టిస్తున్నారు..!
పంచాయతీల్లో పాలన గాడితప్పింది..పారిశుద్ధ్యం పడకేసింది….ప్రజలు రోగాల పాలైతున్నారు..!… pic.twitter.com/3Zijp44v7q
— KTR (@KTRBRS) September 30, 2024
మరోవైపు, కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పోతుగల్లో 200 మంది పింఛన్ దారులు (వృద్ధులు) రూ.20 చొప్పున రూ.2 వేలు పోగేసి షాద్‌నగర్-చేవెళ్ల రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసరా పథకం అసరవుతున్నదని ఎక్స్ వేదికగా కేటీఆర్ అన్నారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు.
మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని గుర్తుచేశారు. అంతటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ అంటూ విమర్శించారు.
ఆసరా పెన్షన్లు వృద్ధులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఎందుకు మీ పాలన, కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా అని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఆదివారం (సెప్టెంబర్ 29) ప్రచురితమైన వార్త క్లిపింగ్‌ను ట్వీట్ చేస్తూ.. ఈ చిత్రం చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో అంటూ ఫైర్ అయ్యారు.