KTR | రైతులకు కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు మాటలు చెప్పారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటున్నాడు.. రైతు కూలీలను పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ భూస్వాములకే వత్తాసు పలుకుతున్నాడు.. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు.. మేం 2 లక్షల రుణమాఫీ చేస్తాం.. కేసీఆర్ 10వేలు ఇస్తే మేం 15వేలు ఇస్తాం.. రైతు కూలీలను అరుసుకుంటాం కానీ ఎన్నెన్నో మాటలు చెప్పారని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈరోజు వరకు రైతుబంధుకే దిక్కులేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో జూలై నెలలో నాట్లు పడే టైమ్‌కు 7600 కోట్లు రైతుల ఖాతాలో పడుతుండేవని గుర్తు చేశారు. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎత్తగొట్టి, రుణమాఫీ చేసినమని బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. పంద్రాగస్టులోపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోతే చూడండి అని ఏ దేవుడి దగ్గరికి పోతే అక్కడ ఒట్లు వేశారని గుర్తుచేశారు. భద్రకాళి మీద ఒట్టు.. సమ్మక్క-సారక్క మీద ఒట్టు.. లక్ష్మీనరసింహస్వామి ఒట్టు వేశారని అన్నారు. ఇవాళ పంద్రాగస్టు కదా.. మరి రుణమాఫీ అయ్యిందా అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ల సంగతేంటి? వాళ్లెంత బాధపడాలని అన్నారు. ఓట్ల కోసం ఆఖరికి దేవుళ్లను కూడా విడిచిపెట్టకుండా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఇంకా సిగ్గులేకుండా రుణమాఫీ అయిపోయిందని పత్రికాప్రకటనలు ఇచ్చారని అన్నారు.
రైతులకే కాదు.. కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులకు కూడా ఇదే విషయం అర్థమైందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అయిపోయింది.. తెలంగాణకు రావాలని రాహుల్‌గాంధీని రేవంత్ రెడ్డి అడిగారట.. కానీ రాహుల్ సమాచారం తెప్పించుకున్నారట.. ఇది 100 శాతం బోగస్ అని తేలింది.. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు అని చెప్పారు. రుణమాఫీ కాలేదు.. అందుకే రాహుల్ గాంధీ రాలేదని తెలిపారు.
పంట బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారని అన్నారు. కనీస మద్దతు ధర 2183 ఉందని.. దానికి 500 బోనస్ కలిపి 2683 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపారు. రూ.2183 కనీస మద్దతు ధర ఏ వడ్లదని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు అని.. కేబినెట్ బయటకు వచ్చి సన్న వడ్లకు ఇస్తానని అంటున్నారని తెలిపారు. సన్న వడ్లను 10 శాతం మాత్రమే పండిస్తారని.. దానికి బయట గిరాకీ బాగుంటుందని తెలిపారు. దానికి 2700 రానే వస్తుందని.. దానికి బోనస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కటే అని పేర్కొన్నారు.
గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అని పెద్దలు అంటరు అన్నట్టుగా పంట బోనస్ వ్యవహారం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక పంతులు ఉంటడు.. కృష్ణుడికి పూజ చేస్తుంటడు.. పేలపిండి, పేలాలు, పిండి కలిపి ప్రసాదం తయారు చేసి పెట్టిండు.. ఈలోపు జోరున గాలి కొట్టి ప్రసాదం మొత్తం ఎగిరిపోయింది.. కృష్ణా మొత్తం నీకే నీకే అని పంతులు అన్నడు.. పంట బోనస్ కూడా గంతే ఉందని కేటీఆర్ సెటైర్ వేశారు. బయట 2700 వస్తే రైతు నీ దగ్గర తీసుకోనే తీసుకోడు.. అందుకే ఇచ్చే అవసరం లేని సన్న వడ్లకు బోనస్ ఇస్తానని ప్రకటించారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన దొడ్డు వడ్లకు ఏమో దిక్కులేదని అన్నారు. పంట బోనస్ బోగస్ అయిపోయిందని.. రుణమాఫీ ఉత్త ముచ్చట అయ్యిందని.. రైతు కూలీలు, కౌలు రైతుల సంగతి ఉత్తదే అయ్యిందని అన్నారు. ఈ సంగతంతా రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని తెలిపారు.