KTR | ఖమ్మం : తన సీఎం సీటుకు ఎసరు పెడుతారనే భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదాని నీ మనువడి మీద ఒట్టేసి చెప్పే ధైర్యం ఉందా..? అని కేటీఆర్ నిలదీశారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
దమ్ముంటే, మగాడివి అయితే చెప్పు. నీ సీటుకు ఎవడు ఎసరు పెడుతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు నువ్వు ట్యాప్ చేయడం లేదా..? బయటకొచ్చి నేను వీళ్ల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని నీ మనువడి మీద ఒట్టేసి చెప్తావా..? అని రేవంత్‌ను కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవం కాదా..? లై డిటెక్టర్ ముందు కూర్చుని చెప్తావా..? మగాడివి అయితే రా. దమ్ముంటే బయటకొచ్చి ఒట్టేసి చెప్పు. చేసేది గలీజ్ పనులు.. మీదికెళ్లి పెద్ద పెద్ద మాటలు. ఓ గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి ఒక్కటే చెప్తున్నా.. ఇప్పటికి 50 సార్లు ఢిల్లీకి పోయావు.. 50 పైసలు అయినా వచ్చాయా..? ఢిల్లీకి పోవడం చీకట్లో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడం. రాహుల్ గాంధీ ఏమో నిన్ను దేకట్లేదు. అపాయింట్మెంట్ ఇస్తలేడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేను సవాల్ స్వీకరిస్తున్నా.. చర్చకు రమ్మంటే పారిపోయావు. మళ్లీ నన్ను అంటడు పారిపోయానని. కానీ పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు. సొంత ఛాలెంజ్‌ను కూడా స్వీకరించలేదు నువ్వు. ఎప్పుడంటే ఎప్పుడు.. ఎక్కడంటే ఎక్కడ చర్చకు రెడీ. హామీలు అమలు చేయలేవు.. ఆ దమ్ము లేదు. పనికిమాలిన వితండవాదాన్ని ప్రజలు పట్టించుకోకండి. నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి. రానున్న రోజుల్లో గల్లా పట్టి అడగాలి అని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.