KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీల మధ్య కొనసాగుతున్న రహస్య మైత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బడే భాయ్ పార్టీ బీజేపీ పహారా కాస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్రూప్-1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ కిమ్మనదు అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం చేసిన నేరపూరిత నిర్లక్ష్యం మీద డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణల మీద బీజేపీ మౌనానికి కారణమేంది? బీఆర్ఎస్ హయాంలో ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అని ఒంటికాలి మీద లేచిన బీజేపీ నేతలు గ్రూప్-1 స్కాం మీద అదే విచారణ ఎందుకు కోరడం లేదు? రేవంత్-బీజేపీల రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే! అని కేటీఆర్ పేర్కొన్నారు.