KTR | హైదరాబాద్ : బడా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని .. ఇదే బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే.. రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు.
2019 మార్చిలో కరోనా వచ్చింది. అప్పుడు దేశమంతా అల్లకల్లోలం. రవాణా సౌకర్యాలు స్తంభించిపోయిన పరిస్థితి. పిల్లలను ఎత్తుకుని, సూట్ కేసుల మీద పిల్లలను కూర్చోబెట్టుకొని హైవేల మీద వెళ్లిన పరిస్థితి. ఆ రోజులు మరిచిపోవద్దు. అప్పుడప్పుడు మరిచిపోయి లంగలకు ఓట్లు వేస్తే మన నెత్తి మీద కూర్చుంటారు. ఆనాడు మోదీ కార్మికులను పట్టించుకోలేదు. రైళ్లు, బస్సులు పెట్టమంటే చలనం లేదు. హృదయం లేని మనిషి నరేంద్ర మోదీ. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టిండు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మన దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకదు. ముడి చమురును తీసుకొచ్చి ప్రాసెస్ చేసి అమ్ముతుంటారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు.. ఇవాళ 84 డాలర్లు. ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా..? మోదీ దేవుడు కాబట్టి పెరిగినవి. డిజీల్, ప్రెటల్పై రాష్ట్రంలో పన్ను పెంచలేదు. సెస్‌ల పేరు మీద సుంకాలు వేసి పెట్రోల్, డిజీల్ ధర పెంచిండు మోదీ. ఈ పదేండ్లలో సెస్‌ల పేరు మీద 30 లక్షల కోట్లు వసూళ్లు చేశాడు మోదీ. ప్రతి రోజు సుంకం కడుతున్నాం. జాతీయ రహదారుల కోసం సెస్ పెట్టామని కేంద్రం చెబుతోంది. కానీ ప్రతి జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు చేస్తున్నారు. ఒక దిక్కు టోల్.. ఇంకో దిక్కు సెస్‌లు గుంజుతున్నారు. మరి రూ. 30 లక్షల కోట్ల గురించి నిలదీస్తే వాస్తవం బయటపడింది. వీటిలో బడా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు మోదీ. నేను చెప్పేది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.