KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అనుచరులకు ఎల్ అండ్ టీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన 280 ఎకరాల భూములపై కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు అర్ధాంతరంగా పోయిందో.. సీఎం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలాన్ని కూడా ఎల్ అండ్ టీ ఎదుర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత రైడర్‌షిప్ తగ్గుతదన్న అపోహాలను తట్టుకుని నిలబడ్డది. ఒక వైపు మీరు చెబుతున్నారు తెలంగాణ రైజింగ్ అని.. మరి రైజింగ్ ఉంటే ఎల్ అండ్ టీ ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చిందో చెప్పాలి. స్వయంగా ఎల్ అండ్ టీ సంస్థను సీఎం బెదిరిస్తున్నారు నిస్సిగ్గుగా.. ఎల్ అండ్ టీ సీఎఫ్‌వో శంకర్ రామన్‌ను జైల్లో వేస్తా అని చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు వల్ల మెట్రోకు నష్టం జరుగుతుంద అని అన్నాడు శంకర్ రామన్. అంతే దానికి జైల్లో వేస్తా అన్నాడు సీఎం. నువ్వేమన్న నియంతవా.. నువ్వేమైనా కిమ్వా.. ఇంత అరాచకమా..? నీ ఇష్టమున్నట్టు మాట్లాడుతావా.. అహంకారపూరితంగా మాట్లాడుతావా..? మీ తప్పులు ఎత్తి చూపిస్తే జైల్లే వేస్తావా… సమస్యను పరిష్కారించాల్సింది పోయి వార్నింగ్ ఇస్తున్నాడు సీఎం. ఎల్ అండ్ టీ వాళ్లు మాకు చుట్టాలా..? మాకేమన్న వ్యాపార భాగస్వామ్యం ఉందా..? అని కేటీఆర్ నిలదీశారు.
ఎల్ అండ్ టీ మీద పగ ఈరోజుది కాదు.. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు సెవనెన్త్ బ్లాక్‌లో కుంగాయి. నాడు ఎల్ అండ్ టీ సంస్థను పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేం పునర్ నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు. అది ఆయన కోపం. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి మొత్తుకుంటే లాభం అయితదని అనుకుంటే.. భారం పడకుండా మేం కడుతామంటే మేం చేసిన చిల్లర పంచాయతీ బంద్ అయిపోతదని రేవంత్ రెడ్డి భావించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు మెట్రో రద్దు. ఎల్ అండ్ టీ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాడు. దాని మీద కక్ష గట్టి వెళ్లిపోయేలా చేసింది రేవంత్ రెడ్డినే. బాంబులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎల్ అండ్ టీ అడ్డం వచ్చిందా..? ఇక్కడి కాంట్రాక్టుల్లో. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎల్ అండ్ టీకి క్వాలిఫికేషన్ లేదట.. బాంబులేటి కంపెనీకి ఉందంట.. కక్ష గట్టి ఎల్ అండ్ టీని టెక్నికల్‌గా డిస్ క్వాలిఫై చేసి అవమాన పరిచి నేన్నుంత కాలం పని చేయకూడదని కక్ష కట్టి పంపించారు. వంత పాడకపోయినందుకు, రూ. 250 కోట్లు పెట్టి మేడిగడ్డ రిపేర్ చేస్తామని చెప్పినందుకు చివరకు ఈ రకంగా ఎల్ అండ్ టీని వెళ్లగొట్టిండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎల్ అండ్ టీ సంస్థ వెళ్లిపోవడంతో ఇవాళ 15 వేల కోట్ల రూపాయాలు రాష్ట్ర ప్రజల నెత్తిమీద పడింది. సీఎం బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్ల ఇది జరిగింది. మెట్రో నిర్వహణ నిమిత్తం ఎల్ అండ్ టీ సంస్థకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల స్థలం ఇచ్చింది. ఐటీడీఏ ఉద్యోగులకు జీతాల్లేవు కానీ.. ఈ రాష్ట్ర ప్రజల రూ. 15 వేల కోట్ల భారం మోపారు. పలు కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెడుతున్నాయి. ఈ 22 నెలల కాలంలో రూ. 2 లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారు రేవంత్ రెడ్డి అని కాగ్ చెప్పింది. ఎల్ అండ్ టీ వెళ్లిపోవడం వల్ల మరో 15 వేల కోట్ల అప్పు. ఈ అప్పును ఎవరు కడుతారు. ఆర్టీసీ కార్మికులకు. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు, పదవీ విరమణ ఉద్యోగులకు బెనిఫిట్స్‌కు, ఆరు గ్యారెంటీలకు పైసల్లేవు. కానీ చిల్లర రాజకీయాలకు పైసలు ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎల్ అండ్ టీ వెళ్లగొట్టడం వెనుకా పెద్ద ఎజెండా ఉంది.. ఎల్ అండ్ టీకి అప్పగించిన 280 ఎకరాల మీద సీఎం కన్ను పడింది. అయితే అమ్ముకోవచ్చు.. లేదా ఇంకెవరికైనా వారికి దగ్గరగా ఉండే సంస్థలకు అమ్ముకోవచ్చు. ఇది సీఎం ఎత్తుగడ. అలాగే కొన్ని మాల్స్ ఉన్నాయి. వాటిని ఎవరెవరికి రాసుకుంటారో.. అడ్డగోలు దోపిడీకి ఎలా తెర తీస్తారో మీరందరూ చూస్తారు. చెప్పేటోళ్లకు లేదు కానీ రాసేటోళ్లకు అయినా ఉండాలి కదా..? పీపీపీ అంటే పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్షిప్ కదా.. మెట్రోను లీజుకు ఇచ్చింది.. ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు కూడా లీజుకు ఇచ్చిందే. ఇవాళ రేవంత్ రెడ్డి నిర్వాకం 15 వేల కోట్ల అప్పు ప్రజల మీద రుద్దుతుంటే దాన్ని అందంగా రాస్తారు అని కేటీఆర్ మండిపడ్డారు.