KTR | ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం; సంక్షేమంలో సగం కాదు.. “ఆమే” అగ్రభాగం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా సంక్షేమంలో.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన యావత్ భారత దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరుపదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడింది మనసున్న మన బీఆర్ఎస్ సర్కార్ అని కేటీఆర్ అన్నారు. గర్భిణీలకిచ్చిన “న్యూట్రిషన్ కిట్లు” ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి మెట్లు అని అన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే..ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టేనని.. “కేసిఆర్ కిట్”తోపాటు అందిన 13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని అన్నారు. లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం అందించిన ఘనత మనకే సొంతమని పేర్కొన్నారు. కార్పొరేట్‌కు ధీటైన గురుకులాలతో పేద మధ్య తరగతి తల్లిదండ్రుల కలలు సాకారమయ్యిందని అన్నారు.
ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన “షీటీమ్స్”.. ఓ సంచలనమని కేటీఆర్ అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన “వీహబ్”.. ఓ సంకల్పమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఓ నవశకమని తెలిపారు. ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ.. ఓ గొప్ప సంప్రదాయమని అన్నారు. కల్యాణలక్ష్మి కేవలం పథకంకాదు… ఒక సరికొత్త విప్లవమని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్ పడితే.. మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించిన భరోసా బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను భగీరథతో శాశ్వతంగా తీర్చిన మిషన్.. మన అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు అత్యధిక పారితోషికాలతో.. గౌరవప్రదంగా జీవించే విజన్ అని అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంపై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం.. అమ్మఒడి వాహనాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారన్నారు.
మహిళా సంక్షేమంలో నాటి మన పాలనకు ఎదురులేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మహిళా సాధికారతలో నాడు మన తెలంగాణకు తిరుగులేదని అన్నారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా.. కొండంత అండగా నిలిచిన ఏకైక పాలకుడు.. మన కేసీఅర్ అని కొనియాడారు. పదేళ్ల పాలనలో సముద్రమంత సంక్షేమాన్ని అందించి ఆడబిడ్డల సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసిన BRS పక్షాన.. యావత్ నారీ శక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.