KTR | హైదరాబాద్ : ప్రతి ఏడాది దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు విస్తృతంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్‌ను హైదరాబాద్ సహా పాత జిల్లాల కేంద్రంగా నిర్వహిస్తాం. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు చేసుకుందామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంస్కృతి, భాషపరంగా తెలంగాణ ఔన్నత్యాన్ని చెప్పుకునే విషయంలో కొంతమేర సఫలం అయ్యాం. బతుకమ్మ, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం. తెలంగాణ చరిత్రను, ఉద్యమకారులను సిలబస్‌లో పెట్టుకున్నాం. అదే మాదిరిగా యూనివర్సిటీలకు గొప్ప నాయకులు పేర్లు పెట్టుకున్నాం. పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి గొప్ప మేధావుల పేర్లు పెట్టుకున్నాం. కొత్త జిల్లాలకు కూడా ఉద్యమకారుల పేర్లు పెట్టుకున్నాం.. అలా తెలంగాణ చరిత్రను వెలుగెత్తే చాటే ప్రయత్నం చేశామని కేటీఆర్ తెలిపారు.
ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ నాయకత్వంలో మూడు రోజులు ఘనంగా నిర్వహించాం. రచయితలు, కవులను ఘనంగా సన్మానించుకున్నాం. సాంస్కృతిక సారథి పెట్టి రసమయి బాలకిషన్‌ను చైర్మన్‌గా నియమించి, 500 మంది కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చాం. ప్రాజెక్టులు కట్టుకుంటే.. ఆయా ప్రాంతంలో ఉండే దేవుళ్ల పేర్లు పెట్టుకున్నాం. కానీ మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నాలు జరగలేదు. మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం జరగలేదు. ప్రాంతం శాశ్వతం.. అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ శాశ్వతం కాబట్టి తెలంగాణ చరిత్ర శాశ్వతంగా గొప్పగా నిలవాలని ఈ ప్రయత్నం చేశాం. కేసీఆర్ పేర్ల మీద ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాళోజీ కళాక్షేత్రం వరంగల్‌లో కట్టినా.. ఇతర జిల్లాల్లో కాళోజీ కళాభారతి పేరిట నిర్మించాం. సాహితీవేత్తలకు, రచయితలకు పెద్దపీట వేశారు కేసీఆర్. గ్రంథాలయాలు కొత్తవి ఎన్నో ప్రారంభించుకున్నాం. ఇంకా జరగాలి అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ మీద కోపంతో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు : కేటీఆర్
Narayan Singh Chaura: సుఖ్బీర్ బాదల్‌పై కాల్పులు జరిపిన నారాయన్ సింగ్ ఎవరో తెలుసా?
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?