అమృత్సర్: శిరోమణి అకాలీ దళ్ చీఫ్, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ దుండగుడు ఇవాళ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గన్‌తో ఫైర్ చేసిన అతన్ని నారాయణ్ సింగ్ చౌరా(Narayan Singh Chaura)గా గుర్తించారు. అతను మాజీ ఖలిస్తానీ మిలిటెంట్. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద సేవాదార్ విధులు నిర్వర్తిస్తున్న సుఖ్‌బీర్‌పై నారాయణ్ సింగ్ కాల్పులు జరిపాడు.
గతంలో అకాల్ ఫెడరేషన్ చీఫ్‌గా చేశాడతను. పాకిస్థాన్‌లో శిక్షణ పొందాడు. సిక్కు తీవ్రవాదంపై పుస్తకాలు రాశాడు. మూడుసార్లు అతను పాకిస్థాన్‌కు వెళ్లాడు. 1995లో అతను ఇండియాకు వచ్చాడు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో చౌరా అనుమానితుడిగా ఉన్నాడు. 2004లో బురెయిల్ జైలు నుంచి పారిపోయిన కేసులోనూ అనుమానితుడిగా ఉన్నాడు. బియాంత్ సింగ్‌ను హత్య చేసిన బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ చీఫ్ గజతార్ సింగ్ హవారాతో పాటు నలుగురు వ్యక్తులు జైలులోని బరాక్ నెంబర్ 7 నుంచి పారిపోయారు. 2004 , జనవరి 21వ తేదీన ఆ ఎస్కేప్ ఘటన చోటుచేసుకున్నది.
#WATCH | Punjab: Bullets fired at Golden Temple premises in Amritsar where SAD leaders, including party chief Sukhbir Singh Badal, are offering ‘seva’ under the religious punishments pronounced for them by Sri Akal Takht Sahib, on 2nd December.
Details awaited. pic.twitter.com/CFQaoiqLkx
— ANI (@ANI) December 4, 2024
చౌరాపై మొత్తం 30 కేసులు ఉన్నాయి. 2010 మే 8వ తేదీన అతనిపై ఎక్స్‌ప్లోజివ్స్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అమృత్‌సర్‌లోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్లో ఆ కేసు నమోదైంది. యూఏపీఏ చట్టం కింద కూడా అతనిపై అమృత్సర్, తరన్ తారన్, రోపర్‌లో కేసులు రిజిస్టర్ అయ్యాయి.
2013, ఫిబ్రవరి 28వ తేదీన అతన్ని అరెస్టు చేశారు. తరన్ తారన్ లోని జలాలాబాద్ గ్రామంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. 1984లో చౌరా పాకిస్థాన్‌కు పారిపోయాడు. సిక్కు తీవ్రవాదం జోరుగా ఉన్న రోజుల్లో అతను భారీ స్థాయిలో ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్మగ్లింగ్ చేశాడు. పాకిస్థాన్‌లో ఉన్న సమయంలో నారాయణ్ సింగ్ గెరిల్లా యుద్ధంపై పుస్తకాలు రాశాడు.