ఖిలావరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట, దివిటిపల్లి గ్రామాల రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, ప్రతిపాదిత 6ఎల్–ఎన్ఎంసీ (6L–NMC) కాలువ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరారు. రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మన్నపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 6ఎల్–ఎన్ఎంసీ, 4ఎల్–ఎన్ఎంసీ, 1ఎల్/7ఎల్–ఎన్ఎంసీ అనే మూడు కాలువలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందన్నారు.
అయితే 6ఎల్–ఎన్ఎంసీ కాలువ అవసరం లేదని, దీంతో అనవసరంగా వ్యవసాయ భూములు నష్టపోతాయని వారు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ పరిసరాల్లో ఉన్న భూములకు ఇప్పటికే చెరువులు, బోరు బావుల ద్వారా తగినంత నీటి సౌకర్యం ఉందని తెలిపారు. ప్రతిపాదిత 6ఎల్–ఎన్ఎంసీ కాలువ దివిటీపల్లి గ్రామ చెరువు పారకం ప్రాంతం నుంచి పొలాల మధ్యగా వెళ్లి, దమ్మన్నపేట చెరువు వెనుక భాగం గుండా గ్రామం పక్కనుగా దమ్మన్నపేట స్కూల్ వరకు సాగుతుంది. ఇలా నిర్మిస్తే సన్నకారు, చిన్నకారు రైతులైన తమ భూములు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, దాంతో జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దివిటీపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 267, 309, 316, 315, 314, 6, 10, 11, 50, 41, 49, 48, 53, 33, 28, 29, 30, 31లోని భూములు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన 814, 808, 807, 801, 800, 792, 794, 793, 654, 653, 655, 656, 657, 659, 660, 661, 662, 756, 757, 755 సర్వే నంబర్లలోని భూములు కాలువ నిర్మాణంతో నేరుగా ప్రభావితమవుతాయని రైతులు తెలిపారు. అందువల్ల దివిటిపల్లి గ్రామంలో కొంత భాగం, దమ్మన్నపేట గ్రామంలో ఉన్న పూర్తి 6ఎల్–ఎన్ఎంసీ కాలువను రద్దు చేసి తమ భూములను కాపాడాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.
ప్రత్యామ్నాయంగా దివిటీపల్లి గ్రామ స్కూల్ వెనుక ఉన్న వాగులోకి కాలువను మళ్లిస్తే, ఆ నీరు దమ్మన్నపేట చెరువు ద్వారా వర్ధన్నపేట చెరువుకు చేరుతుందని, ఇలా చేస్తే నీటిసౌకర్యం కూడా మెరుగుపడి, భూములు కూడా రక్షించబడతాయని వారు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో రెండు గ్రామాల రైతులు కొండబోయిన సాయిలు, నగరబోయిన ఎల్లయ్య, సదయ్య, తీగల కుమార్, భాషబోయిన ఉప్ప, బక్కయ్య, శ్రీనివాసరెడ్డి, మామిండ్ల సారయ్య ఉన్నారు.