KTR | సిరిసిల్ల రూరల్, మార్చి 2 : మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటామని.. నామీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతు రాజిరెడ్డితో అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ఇటీవల అక్రమ కేసుతో జైలుకు వెళ్లి వచ్చిన రైతు రాజిరెడ్డిని కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతు రాజిరెడ్డితో మాట్లాడారు. కేసీఆర్ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఎవరైనా మిగిలే వాళ్ళు కాదు కదా అన్నారు. బాధపడుకుర్రి.. భయపడకుర్రి.. ఎవ్వలకేమైనా ఇదే రకంగా కాపాడుకుంటా.. అండగా ఉండి ఆదుకుంటానని భరోసానిచ్చారు కేటీఆర్. గరీబోళ్లకు కులం మతం ఉండదు.. నీకు నిజంగా అసైన్డ్ భూమి ఉంటే ఉండనీ.. ఎందుకు ఉండొద్దు. అసైన్డ్ భూమి అనేదే పేదలకు ఇచ్చేది కదా అని కేటీఆర్ పేర్కొన్నారు.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మేము కక్షలు చేయలే.. మేమే కక్షపూరితంగా వ్యవహరిస్తే వాళ్ళు ఉండేవాళ్ళ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కేసీఆర్ మన ప్రభుత్వ పాలనలో.. మన పని మనం చేసుకుంటూ.. ప్రజలకు అండగా ఉండమన్నారు. కాంగ్రెసోళ్లు వచ్చినా, బీజేపోళ్లు వచ్చినా వాళ్లకు లాభం చేసినం కానీ నష్టం చేయలేదని కేటీఆర్ తెలిపారు.
ఒక పేదోడు బతుకుదెరువు కోసం టీ స్టాల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసేసిన దరిద్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని కేటీఆర్ మండిపడ్డారు. మళ్లా మంచి రోజులు వస్తాయనీ ఇప్పుడు, అప్పుడు మీకు అండగా నేనే ఉంటానని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం ఉన్న చెప్పండి.. అండగా ఉంటానని భరోసానిచ్చారు. అంతకుముందు రాజిరెడ్డి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు సైతం ధైర్యం చెప్పారు.
కేటీఆర్ వెంట న్యాప్ క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ జడ్పీటీసీ అంతయ్య, మాట్ల మధు, విజేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్ కోడూరి భాస్కర్ గౌడ్, పార్టీ నాయకులు ఉన్నారు.