KTR | హైదరాబాద్ : శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్‌కు చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయడం ఆశామాషీ వ్యవహారం కాదు. ‘తల్లికి జన్మనిచ్చిన తనయుడు ఇతడు’ అని గోరటి వెంకన్న కేసీఆర్‌ను ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అని కేటీఆర్ అన్నారు. మహేంద్ర తోటకూరి రచించిన ప్రజా యోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు.
2004లో భారతదేశానికి తిరిగి వచ్చి ఉద్యోగం చేస్తూనే 2006 వరకు జయశంకర్ సార్, విద్యాసాగర్ సార్, కేసీఆర్‌తో గడిపే అవకాశం దక్కింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలా అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలిగింది. పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, చరిత్రలో జరిగిన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, కేసీఆర్ ఏం చేశాడని కొట్టిపారేయవచ్చు. కానీ 25 ఏళ్ల కిందటి పరిస్థితి మాత్రం ఇలా లేదు. ఆ రోజు కేంద్రంలో వాజపేయి నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏ కన్వీనర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ బద్ధ వ్యతిరేకి చంద్రబాబునాయుడు ఉన్నారు. మరోవైపు తెలంగాణ దుర్భర పరిస్థితికి కారణమైన వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ చాలా బలంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టి, రాజకీయ శక్తిగా ప్రజల ఓట్లను ఆయుధంగా చేసుకొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లును పాస్ చేయించుకొని రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పడం దుస్సాహసం అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ వంటి జాతీయ పార్టీలు, తెలుగుదేశం, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఇవాళ నిలదొక్కుకున్నాయి. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు, ప్రపంచమంతా కుగ్రామంగా మారుతుంటే, సరిహద్దులు చెరిగిపోతుంటే ఇంకా ప్రాంతీయ తత్వాలు ఏమిటని విమర్శించారు. పదవి రాకపోతే తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటారు, పదవి రాగానే ఆ జెండాను పక్కన పెడతారన్న అపనమ్మకం తెలంగాణ సమాజంలో బలంగా ఉండేది. 1971లో తెలంగాణ ప్రజా సమితి బ్యానర్ మీద 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి కాంగ్రెస్‌లో విలీనం కావడం వల్ల, 370 మంది ఆత్మబలిదానాలు వృథా కావడంతో ఇక తెలంగాణ రాదన్న నిరాశ ప్రజల్లో ఉండేది. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగా కేసీఆర్ సినిమా స్టార్ కాదు. ఆయనకు కుల బలం, ధన బలం, మీడియా పవర్, బలగం ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను తట్టుకొని పార్టీ పెట్టి, రాజకీయ లక్ష్యాలను సాధించాలంటే ఎంత కష్టమో, గమ్యం తెలియని ప్రయాణం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వయస్సు 47 ఏళ్లు. రాజకీయ నాయకులకు అది టేకాఫ్ టైం. ఆ సమయంలో ఒక లక్ష్యంతో ప్రజల కోసం ముందుకు రావడం సాధారణ సాహసం కాదు. దృఢ సంకల్పం, దైవ బలం ఉన్న యోధుడికే అది సాధ్యమవుతుంది, సామాన్యులకు కాదు అని కేటీఆర్ అన్నారు.
2001 నుంచి 2014 వరకు ఆయన పడ్డ కష్టం ముందు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కష్టం ఏమాత్రం కాదు. ఎన్నో ప్రతికూల శక్తులు అడ్డంగా ఉన్నప్పుడు, దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ పార్టీని చిదిమివేయాలని చూస్తున్నప్పుడు, తెలంగాణను నడిపే సమర్థత ఉందా అని మనల్ని అవహేళన చేస్తున్నప్పుడు కేసీఆర్ ఒక్కరే తెలంగాణ కోసం నిలబడ్డారు. మన భాష, మన యాసను సినిమాల్లో జోకర్లకు, విలన్లకు మాత్రమే ఉపయోగించారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం కొట్లాడాలంటే తెగింపు కావాలి. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకులా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించారు. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా ఏ రోజు నమ్మకాన్ని కోల్పోకుండా, ప్రజల మీదనే భారాన్ని ఉంచి, దేవుడి ఆశీర్వాదంతో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న తాను తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతానని చెప్పాలంటే దానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. “నేను ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి” అని 2001లో జరిగిన సింహగర్జనలో కేసీఆర్ ప్రజలకు చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీలతో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని నేటి రాజకీయ నాయకుల మధ్య అలాంటి మాటను ఊహించలేం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పే గుండె ధైర్యం కేసీఆర్‌కు మాత్రమే ఉంది. తెలంగాణ వచ్చాక ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని పునర్నిర్మించారు. పల్లెల్లో ఏమేమి ఉండాలో ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా పట్టణాలను ఎలా విస్తరించాలో ఆలోచించిన నాయకుడు కేసీఆర్. అందుకే పదేళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు కాదు. “ఉద్యమకారులు మంచి పరిపాలన చేయలేరని అనుకునేవాళ్లం, కానీ మీకు మాత్రం మంచి నాయకుడు దొరికాడని” గతంలో అరుణ్ జైట్లీ మాతో అన్నారు. సాధించిన రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం అందరికీ దక్కే అదృష్టం కాదు, నువ్వు కారణజన్ముడవని ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్‌ను మెచ్చుకొని ఆశీర్వదించారు అని కేటీఆర్ గుర్తు చేశారు.