హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీరు కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. వానకాలం సీజన్లో రాష్ట్రంలో 1.53 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే.. ఇప్పటివరకు ప్రభుత్వం కొన్నది 46 లక్షల టన్నులు మాత్రమేనని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేల ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ.26 వేల కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి రైతుల్లో ఆశలు రేపి, చివరకు దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి రూ.530 కోట్లతో సరిపెట్టిందని ధ్వజమెత్తారు. అసలు రైతుకే భరోసా లేదు.. ఇక కౌలురైతులు, రైతుకూలీల ఊసెక్కడిదని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లాల వద్దనే కొనుగోళ్లు చేసి కేసీఆర్ ప్రభుత్వం రైతుకు భరోసా కల్పిస్తే.. కల్లోల కాంగ్రెస్ పాలనలో మాత్రం అన్నదాత ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
శ్యామ్ బెనగల్ భావితరాలకు స్ఫూర్తి
లెజెండరీ ఫిల్మ్‌మేకర్ శ్యామ్‌బెనగల్ మరణంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శ్యామ్‌బెనగల్ జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. ఆయన తొలి చిత్రం అంకుర్‌తో తెలంగాణ సామాజిక జీవనాన్ని కండ్లకు కట్టారని అన్నారు. ఆయన మరణం సినీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు.