KTR | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఈ నెల 27న వాతావరణ కేంద్రం హెచ్చరించిందని.. ఆ సమయంలో ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాల్సిందని.. అయితే, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ముందుజాగ్రత్తలు లేవని.. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవన్నారు. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు.. ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాదని.. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడని విమర్శించారు.
మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతాడని.. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదలపై చీప్ మినిస్టర్ సమీక్ష చేస్తారంటూ మండిపడ్డారన్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు.. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ఏపీలో చంద్రబాబు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని.. చంద్రబాబు ప్రభుత్వం ఆరు హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతుందన్నారు. తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో..? అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం కాపాడింది ‘బిగ్ జీరో’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.