హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేతగాని పాలకుల వల్లే యూరియా సంక్షోభం తలెత్తిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని శుక్రవారం ఎక్స్ వేదిక గా స్పష్టంచేశారు. పరిపాలన అంటే ఏమి టో తెలియని అసమర్థులు రాజ్యమేలడంతోనే అన్నదాతలకు ఈ కష్టాలు, కన్నీళ్లని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ నాయక త్వం, ముందుచూపు విధానాలు, పకడ్బం దీ పాలన అంటే ఏమిటో తెలంగాణ స మాజానికి అర్థమైందని, చిల్లర రాజకీయా లు, బూతులు తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, వందేండ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కేసీఆర్‌కు ఉన్న తేడా ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ యూరియా తెప్పించేందు కు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లారని కేటీఆర్ గుర్తుచేశారు. సీజన్ ప్రారంభానికి ముందే ప్రత్యేక కసరత్తు చేసేవారని తెలిపారు. వ్యవసాయ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించేవారని వివరించా రు. ఏటా సీజన్‌కు ముందే ఎరువులు, యూరియా అవసరాలను లెక్కలతో సహా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేవారని వెల్లడించా రు. ఆంధ్రప్రదేశ్‌లోని నౌకాశ్రయాలకు అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసేవారని, యూ రియా రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్వయంగా ఫోన్ చేసి 25 స్పెషల్ గూడ్స్ ట్రైన్లను ఏర్పాటు చేయించేవారని, అవసరమైతే పొరుగు రాష్ర్టాల రవాణా శాఖ మంత్రులతో నేరుగా సంప్రదింపులు జరిపేవారని గుర్తుచేశారు.
పంట ల సీజన్లో ఏకంగా నాలుగు వేల లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు చేసేవారని పేర్కొన్నారు. సమయానికి ప్రతిరైతుకు అవసరం మేరకు యూరియా ను అందుబాటులో ఉంచేందుకు పకడ్బం దీ చర్యలు చేపట్టేవారని తెలిపారు. గ్రా మాల్లో అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయించేవారని వెల్లడించారు. కేసీఆర్‌కు ఉన్న ముందుచూపు, దక్షత కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం వల్లే రైతులు అష్టకష్టాల పాలవుతున్నారని, తిండితిప్పలు మాని రాత్రింబవళ్లు ఎరువుల షాపులు, సింగిల్‌విండో ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారని కేటీఆర్ వాపోయారు.