హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కథ ముగిసిందని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చకదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రభుత్వం 20- 30 శాతం కమీషన్ల చుట్టూ తిరుగుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని మంత్రి సురేఖ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఒకరు మంత్రులంతా 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని బహిరంగంగానే చెప్తున్నారని ఎద్దేవాచేశారు. పదవో, అధికారంతోనో గౌరవం రాదని, చేసే మంచి పనులతోనే గుర్తింపు వస్తుందని చెప్పారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలంటే ప్రతి ఒక కార్యకర్త, నాయకుడు విభేదాలను పకన పెట్టి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో గురువారం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కష్టంకాలంలో కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉన్నోడే నిజమైన నాయకుడవుతాడని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని చూస్తే ‘కుండ పగిలితే పగిలింది గాని కుక బుద్ధి తెలిసింది’ అనే సామెత నిజమే అనిపిస్తున్నదని పేర్కొన్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఓ నాయకుడు కాంగ్రెస్‌లోకి పోతామంటే ఆ పార్టీ వాళ్లు వద్దు అని ధర్మాలు చేసినా ఆ నాయకుడికి సిగ్గు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా అపారమైన గౌరవాన్ని ఆ నాయకుడు పొందారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో కనీసం కూర్చోమని అడిగే దిక్కు కూడా లేదని ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ పార్టీ కార్యకర్తలకే నచ్చడం లేదని, రేవంత్ పాలనను ప్రజలెవరూ ఇష్టపడటం లేదని కేటీఆర్ చెప్పా రు. ‘పోయినోళ్లు పోనీ.. ఉన్న వాళ్లతోనే పార్టీని బలోపేతం చేసుకుందాం. నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లో తిరిగి గులాబీ జెండాను రెపరెపలాడించాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి అబ్జర్వర్లను పంపుతం. ఒక్కో ఊరు, ఒకో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పార్టీని నమ్ముకుని ఉండే వాళ్లకు టికెట్లు ఇస్తం. గెలిపించుకుందాం. పార్టీని పటిష్టం చేసుకుందాం. ఇవాళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుందని చెప్తున్నరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వ పాలనను ఇష్టపడటం లేదు. రైతులయితే ప్రతి ఊర్లో బాధపడుతున్నరు. 20 శాతం, 30 శాతం కమీషన్లు మీకిస్తే మాకు మిగిలేదేంటని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రు. 17 నెలల్లోనే కాంగ్రెస్ చేస్తున్నా దోపిడీ బాగోతం తెలంగాణలోని ఊరూరికీ చేరింది’ అని పేర్కొన్నారు.
చరిత్రలో ఇప్పటిదాకా చూడని విధంగా వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ సభ తర్వాత అకడ కేసీఆర్‌ను చూసిన తర్వాత ప్రత్యర్థుల్లో గజ్జున వణుకు పుట్టిందన్నారు. అందుకే తమ అవినీతి బాగోతం, కమీషన్ల దందాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులిచ్చారని విమర్శించారు. నిజంగానే కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్‌లోకి నీళ్లు ఎకడి నుంచి వచ్చాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో రూ.73 వేల కోట్ల రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో టింగ్‌టింగ్‌మని పడ్డాయని చెప్పారు. ఇప్పుడు రేవంత్ పాలనలో రైతుల ఖాతాల్లో టకీటకీమని డబ్బులు పడట్లేదుగాని ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఖాతాలో, కాంగ్రెస్ అగ్రనేతల ఖాతాల్లో ఠంచన్‌గా పడుతున్నాయని విమర్శించారు.
‘మా ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతది? అకడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటడు కదా! అని చాలామంది తెలంగాణ ప్రజలు అనుకోవడం వల్లే ఫలితాలు ఇలా వచ్చాయి’ అని కేటీఆర్ గుర్తుచేశారు. నాడు కేసీఆర్‌ను దొర దొర అని అన్నవాళ్లే ఇప్పుడు రేవంత్‌రెడ్డిని దొంగ దొంగ అని తిడుతున్నారని చెప్పారు. ‘స్వాతంత్రం వచ్చిన 77 ఏండ్ల తర్వాత కూడా ఈ దేశాన్ని ఏలుతున్న వారికి ఈ ప్రజలకు ఏం కావాలో? ఏం చేయాలో తెలియడం లేదు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అటు పల్లె ప్రజలకు ఏం కావాలో, ఇటు పట్నంవాసులకు ఎలాంటి అవసరాలుంటాయో తెలుసుకొని పనులు చేసిండ్రు. దసరా సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలిచ్చిండ్రు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిండ్రు. క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలిచ్చిండ్రు. కులం, మతం పంచాయితీ లేకుండా ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నరు’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరికను తీర్చి పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని కేటీఆర్ చెప్పారు. నిర్మల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీలు వస్తాయని ఎవరూ అనుకోలేదని, కేసీఆర్ చేసి చూపించారని గుర్తుచేశారు. తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలే ఉంటే కేసీఆర్ 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇన్ని మంచి పనులు చేసినా అనుకున్న ఫలితం రాలేదని పేర్కొన్నారు. ‘నలుగురు కుటుంబసభ్యులున్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు వస్తయి. అలాంటిది ఆరు లక్షల మంది కార్యకర్తలున్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే.
అభిప్రాయభేదాలను పకనపెట్టి అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక కార్యకర్త కష్టపడి పని చేయాలి. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం ఉన్న మాట నిజమే. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పని చేయకుంటే అనుకున్న ఫలితాలు రావు’ అని ఉద్బోధించారు. జూన్, జూలైలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని, దాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నిర్మల్ ఇన్చార్జి రామకిషన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మే 22 (నమస్తేతెలంగాణ):తెలంగాణ ఉద్యమ ధ్రువతార, దళితోద్యమ వేగుచుక్క, తెలంగాణ వైతాళికుడు, దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకొని గురువారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అంబేద్కర్ కన్నా ముందే పీడితుల కోసం గళమెత్తిన సామాజిక ఉద్యమకారుడు భాగ్యరెడ్డివర్మ అని కీర్తించారు. వందేండ్ల క్రితమే దళిత బిడ్డల అభ్యున్నతి కోసం హైదరాబాద్‌లో 26 పాఠశాలలను నడిపిన అక్షర సూర్యుడని పేర్కొన్నారు.
ప్లేగు మహమ్మారి కబళించినప్పుడు గొప్ప సేవలందించిన ఆదర్శ సంఘ సేవకుడని శ్లాఘించారు. బాల్యవివాహాలు, జోగిని లాంటి సాంఘిక దురాచారాల నిర్మూలనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. మరుగున పడిన ఆ మహనీయుడికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో తగిన గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి సముచిత గౌరవమిచ్చిందని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో గురుకుల విద్యావిప్లవంతో బడుగు, బలహీన వర్గాల బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.