ఏ కష్టం వచ్చినా గోపన్న మీ అందరికీ ఎళ్లవేళలా అందుబాటులో అండగా ఉండేవారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో ఆయన మనకు దూరమవ్వడం బాధాకరం. జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న కుటుంబం నేడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఇలాంటి సమయంలో మీరంతా ఆ కుటుంబానికి అండగా ఉండి, మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఆశీర్వదించాలె.. అఖండ మెజార్టీతో గెలిపించాలె.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్‌ను గల్లంతు చేస్తే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజానీకానికి ప్రభుత్వం బాకీ ఉన్నవన్నీ అందుతయ్. నెలకు రూ.4 వేల పింఛన్ రావాలన్నా.. నెలకు రూ.2500 ఆడబిడ్డలకు అందాలన్నా, దివ్యాంగులకు రూ.6 వేలు రావాలన్నా ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలె.
-రోడ్‌షోలో కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను (Congress) గల్లాపట్టి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్ రావాలంటే.. ఆడబిడ్డలకు రూ.2500 అందాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం షేక్‌పేట డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీ జోష్.. ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు పక్కా.. మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందనిపిస్తున్నది’ అని ధీమా వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ చావునోట్లో తలపెట్టి కొట్లాడితే 2014, జూన్‌లో మనకు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన నాడు మన పరిస్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రం వచ్చింది కానీ, పరిస్థితులు ఏమాత్రం బాగాలేకుండె.. నాడు తెలంగాణను 85 వేల కోట్ల అప్పుతో కాంగ్రెస్ మనకు అప్పగించింది.
కరెంటు లేదు, తెల్లారి లేస్తే హైదరాబాద్‌లో ఇన్వర్టర్ లేని దుకాణం, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు’ అని గుర్తుచేశారు. కరెంటు కష్టాలు, మంచినీటి గోస, అప్పుల పాలైన రాష్ర్టాన్ని కాంగ్రెస్ అప్పచెప్పిందని, అలాంటి పరిస్థితుల్లోనూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ రేవంత్‌రెడ్డిలా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పలేదని, ఒక కుటుంబ పెద్దగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపారని వివరించారు. ‘కష్టాలు, కన్నీళ్లు ఉంటయి.. అన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్లేవారినే నాయకుడంటరు.. అందుకే కేసీఆర్ తొలి రోజు నుంచే ఎన్ని కష్టాలున్నా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు’ అని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమేనని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ర్టాన్ని 2023లో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి, తలసరి ఆదాయాన్ని రూ.3.87 లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్దేన ని తెలిపారు. కరెంటు లేని రాష్ట్రంలో 24 గం టల కరెంటును తీసుకొచ్చి కరెంటు కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.

హైదరాబాద్ నగరంలో షేక్పేటలాంటి 42 ఫ్లై ఓవర్లు నిర్మించి ఇటు హైదరాబాద్ నగరాన్ని, అటు పల్లెలను సైతం కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా నిలిపిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. చదువుకోవాలనుకునే నిరుపేద పిల్లల కోసం వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి, అన్ని వర్గాల పేద విద్యార్థులకు విద్యనందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, పెళ్లి చేసుకున్న వారికి షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పేరుతో లక్షా 116 రూపాయలు, ప్రభుత్వ దవాఖానలో ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేల చొప్పున అందించిందని గుర్తుచేశారు. ‘నవజాత శిశువు నుంచి వృద్ధుల వరకు అందరినీ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రూ.200 ఫించన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రూ.2 వేలకు పెంచింది.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా కేసీఆర్ మంచే చేశారు తప్ప ఎవరికీ నష్టం చేయలేదు’ అని వివరించారు. ‘పదేండ్లలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేసినం. పరిశ్రమలు, ఐటీ కంపెనీల విస్తరణ చేపట్టినం. నగర విస్తరణతో పాటు పల్లెల్లో జరిగిన అభివృద్ధి అంతా మీ కండ్ల ముందే ఉన్నది. మీరు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కేసీఆర్‌కే జై కొట్టి, మాగంటి గోపీనాథ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించి మూడోసారి అసెంబ్లీకి పంపారు’ అని గుర్తుచేశారు. ‘జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న గోపన్న కుటుంబం నేడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఇలాంటి సమయంలో మీరంతా ఆ కుటుంబానికి అండగా ఉండి సునీతమ్మను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడొచ్చిన ఉప ఎన్నికలో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదని, కానీ ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుతాయని సూచించారు.
‘420 హామీలు, కల్లబొల్లి కబుర్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులను, పెద్దవారిని కాంగ్రెస్ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వచ్చి రెండేండ్లయినా ఒక్కరికైనా మంచి జరిగిందా ప్రజలు ఆలోచించాలె’ అని కేటీఆర్ సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అందర్నీ కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ‘పదేండ్ల మా పరిపాలన మీ ముందు ఉన్నది. రెండేండ్ల కాంగ్రెస్ పాలన కూడా మీ ముందు ఉన్నది. ఈ రెండేండ్ల పరిపాలనలో ఎవరికైనా లాభం జరిగిందా ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి ఒక్క కారణమైనా ఉన్నదా? ఆలోచించాలి. వృద్ధులకు కేసీఆర్ రూ.2 వేల పింఛన్ ఇస్తే మేము రూ.4 వేలు ఇస్తమన్నరు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నరు. ఒక్క ఆడబిడ్డకైనా ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తామన్నరు. ఆడ పిల్లలకు స్కూటీలిస్తమన్నరు..ఎవరికైనా ఇచ్చిండ్రా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఖరికి కేసీఆర్ కష్టపడి ఇచ్చిన కరెంటునైనా సక్కగా ఇస్తున్నారా? అని ప్రజలను అడిగారు.
కేసీఆర్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే రేవంత్‌రెడ్డి వచ్చిన రెండేండ్లలో వేలాది మంది నిరుపేదల ఇండ్లు కూల్చివేసిండు. పేదల శాపాలు కాంగ్రెస్‌కు ఉరితాడై చుట్టుకుంటయ్. సంపదను సృష్టించడంలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణను రేవంత్‌రెడ్డి ఆగం చేసిండు. హైడ్రా.. హైడ్రా అంటూ రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిండు. ప్లాట్లు కొనేటోడు లేడు.. ఫ్లాట్లు కొనేటోడు లేడు.
– కేటీఆర్
‘ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద.. కానీ ఆయనే రోత మాటలు మాట్లాడితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తే కుటుంబ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి కొన్ని ఇబ్బందులున్నయి.. కొంచం ఓపిక పట్టండి అని చెప్పాలి. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం జనాన్నే దబాయిస్తున్నడు. కోస్కతింటరా? కొడ్తరా? అని బెదిరిస్తున్నడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమేనా?’ అని కేటీఆర్ నిలదీశారు. ‘ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్.. కానీ నేడు 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం వచ్చింది.. జూబ్లీహిల్స్‌లో గట్టిగా తీర్చు ఇచ్చి కాంగ్రెస్ డిపాజిట్‌ను జప్తు చేస్తే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజానీకానికి ఆ పార్టీ బాకీ పడ్డవన్నీ అందుతయ్’ అని సూచించారు. నెలకు రూ.4 వేల పింఛన్ రావాలంటే కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండా చేయాలని, నెలకు రెండున్నర వేలు ఆడబిడ్డలకు రావాలన్నా, దివ్యాంగులకు రూ.6 వేలు రావాలన్నా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ‘మీరు మళ్లీ కాంగ్రెస్ వాళ్లను గెలిపిస్తే ఏమీ ఇవ్వకున్నా మమ్మల్ని గెలిపిస్తున్నరు అనుకుంటరు.
ఇక వీరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి తన హామీలను ఎగ్గొడుతడు’ అని ప్రజలకు సూచించారు. ‘ముస్లింలనుకాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నది. రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నారంటే దోచుకున్న డబ్బులు వెదజల్లితే ఓట్లు వస్తయనుకుంటున్నరు.. కాంగ్రెసోళ్లు వచ్చి డబ్బులిస్తే బరాబర్ తీసుకోండి, కానీ, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి’ అని సూచించారు. ‘ఓటుకు 5 వేలు ఇస్తారంట.. ఇస్తే జేబులో పెట్టుకుని, మిగిలిన పైసలు ఎప్పుడిస్తవు? అని నిలదీయండి. ఆడబిడ్డలు మిగిలిన 55 వేలు ఎప్పుడిస్తరని అడగండి. వృద్ధులు మిగిలిన 48 వేలు ఎప్పుడిస్తరని అడగండి. ఆటోడ్రైవర్లు 24 వేలు ఎప్పుడిస్తరని ప్రశ్నించండి’ అని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ముస్లింల సంక్షేమానికి 4000 కోట్ల బడ్టెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, బీఆర్ఎస్ భయంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, నవంబర్ 11న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మీ సోదరి మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటు వేయాలని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్‌లో మంచి మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని, మూడో నంబర్‌తో ఉండే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్, అక్షర, వాత్సల్య, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ లాభం జరిగింది. జీవో 58, 59 కింద హైదరాబాద్‌లో లక్షా 50 వేల మంది పేదోళ్లకు పట్టాలిచ్చినం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలే. ఒక్క పేదవాన్ని ఆదుకోలే. కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్‌లో 3500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఒక్క ఇల్లయినా నిర్మించిందా?
– కేటీఆర్
రేవంత్‌రెడ్డి ఆటో అన్నల కారోబార్ మొత్తం దెబ్బతీశాడని, ఒకప్పుడు రెండు, మూడు వేలు సంపాదించిన ఆటో అన్నలు నేడు వెయ్యి కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఉపాధి కోల్పోయి రాష్ట్రంలో 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆరర్ వాపోయారు. ‘రియల్ ఎస్టేట్ బందైంది. కారోబార్లు దెబ్బతిన్నయ్. పరిశ్రమలు పారిపోతున్నయ్.. మొన్ననే కార్మింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు, కేమ్స్ అనే పరిశ్రమ గుజరాత్‌కు పారిపోయినయ్. ప్రీమియర్ ఎనర్జీ ఆంధ్రాకు వెళ్లిపోయింది. ఇలా ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ర్టాలకు వెళ్లిపోతుంటే ఈ కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నట్టు?’ అని నిలదీశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మూడున్నర లక్షల మంది ఉన్న ఐటీ ఉద్యోగులను 10 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తే, నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ర్టాన్ని అట్టడుగు స్థానంలోకి నెట్టేసిందని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో జీవో 58, 59 కింద హైదరాబాద్‌లో లక్షా 50 వేల మంది పేదలకు పట్టాలిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని, ఒక్క పేదవాన్ని కూడా ఆదుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మూడున్నర వేల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మొత్తం లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించినట్టు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లయినా నిర్మించిందా? అని ప్రశ్నించారు. ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్డుడా? హైడ్రా పేరుతో మీ బస్తీల్లోకి రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హఠావో అంటున్నడు. కేసీఆర్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే రేవంత్‌రెడ్డి వచ్చిన రెండేండ్లలో వేలాది మంది నిరుపేదల ఇండ్లు కూల్చివేసిండు’ అని నిప్పులు చెరిగారు. సంపదను సృష్టించడంలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణను రేవంత్‌రెడ్డి ఆగం చేశాడని, రియల్ ఎస్టేట్‌ను మొత్తం నాశనం చేశాడని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు వేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘నీళ్లు, కరెంటు, పథకాలు ఇచ్చే తెలివిలేని కాంగ్రెస్‌కు కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించే తెలివి కూడా లేదు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నడూ కులం, మతం పేరు మీద రాజకీయాలు చేయలేదని, పేదవారు ఏ కులంలో ఉన్నా, మతంలో ఉన్నా వారికి మంచి చేయాలనే ఆలోచనతోనే పనిచేశారని గుర్తుచేశారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినయ్.. రంజాన్ బహుమతులు వచ్చినయ్.. క్రిస్మస్ కానుకలు వచ్చినయ్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవన్నీ వస్తున్నయా?’ అని కేటీఆర్ ప్రశ్నించగా అక్కడ ఉన్న ప్రజలంతా ముక్త కంఠంతో ‘వస్తలేవు’ అని సమాధానమిచ్చారు. ‘వాదేతో హసీమ్ కర్తేహై.. పర్ నిబానా బూల్ జాతేహై.. ఆగ్ లగాకే సీనేమే బుజానా బూల్ జాతేహై.. వాదేతో హసీం కర్తేహై.. నిబానా బూల్ జాతేహై అని మాటలు చెప్పిండ్రు కానీ, వాటిని నిలబెట్టుకునే తెలివి లేదు, అమలు చేసే జ్ఞానం లేదు’ అని దుయ్యబట్టారు.