KTR | హైదరాబాద్ : సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇది. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మరిచిపోకముందే.. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే.. రాష్ట్రంలో సీఎం, ఆయన సోదరుల ఆరచకాలకు అంతేలేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక : ఎమ్మెల్సీ కవిత
Harish Rao | నడిరోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. హరీశ్‌రావు ఫైర్