KTR | మినీ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఆదివారం నాడు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ నేతృత్వంలో సమావేశమైన ఈ బృందం మినీ అంగన్వాడీల సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది.
రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియ పూర్తిగా అమల్లోకి రాలేదని కేటీఆర్‌కు సంఘం ప్రతినిధులు వివరించారు. జనవరి నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రధాన అంగన్వాడీ టీచర్లతో సమానంగా రూ.13,650 వేతనాలు చెల్లించడం ప్రారంభించినప్పటికీ, మార్చి నెల నుంచి మళ్లీ పాత వేతనం రూ.7,800 మాత్రమే అందించడంలో అసమతుల్యత నెలకొందన్నారు. దీనివల్ల మినీ అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మినీ అంగన్వాడీ టీచర్లు ప్రధాన అంగన్వాడీ టీచర్లతో పోలిస్తే ఎక్కువ పనులు చేయాల్సి వస్తోందని, ఒక్కరే టీచర్‌గా ఉండి ఆహార పంపిణీ, పిల్లల సంరక్షణ, విద్యా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, బీఎల్వో డ్యూటీలు, సర్వేలు, పల్స్ పోలియో వంటి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.. ఇంతైనప్పటికీ, హెల్పర్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, ఇది వారి పనిభారం మరింత పెంచిందని తెలిపారు.
కేంద్రాలకు సంబంధించిన బకాయిలు కూడా సమస్యలలో కీలకమని సంఘ ప్రతినిధులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల కిరాయిలు, కూరగాయల బిల్లులు, ఇతర ఖర్చులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ ఆర్థిక సమస్యలు టీచర్ల జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు వేతనాలు సమానంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.