KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబానికి కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. ‘పదేళ్లు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం? మీ కండ్ల ముందుటున్నది. గత సంవత్సరంగా ఎంత క్షోభపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీరికి బుద్ధి చెప్పేలా తీర్పునివ్వండి. ఇంటింటికి ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. రైతుభరోసా అన్నరు.. రూ.10వేలు కాదు.. రూ.15వేలు అన్నరు. ఏవి కొడకా? అని అడగంటి. ఎక్కడబాయే రుణమాఫీ అని అడగండి. ఎందుకు కటింగ్‌లు పెడుతున్నరు.. ఏమయ్యాయి నీ ఆరు గ్యారంటీలు అని నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి అడగండి. ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు. గల్లాపట్టి అడిగే అధికారం మీకున్నది’ కేటీఆర్ అన్నారు.
‘చివరికి ఈ దివాళాకోరు ముఖ్యమంత్రి.. చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ గురించి. ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు. ఆయనకు బర్దాష్ అయితలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయనకు నిద్రపడుతలేదు. మనుసునపడ్తలేదు. నాకు అయితే అనుమానం ఉంది. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడో దూరంలో లేదు. ఎర్రగడ్డ దగ్గరలోనే ఉంది. తీసుకుపోండ్రి.. ఇట్ల విడిపెట్టకుండ్రి. రేపో ఎల్లుండే ఎవరినైనా కరిచేటట్లు ఉన్నడు చూస్తుండే. తప్పకుండా తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపించి కాపాడుకోండి. ఇంకా చిన్నవయసులోనే ఉన్నడు. కాబట్టి కాపాడుకొమ్మని చెబుతున్న.
చివరగా నేను చెప్పే మాట ఒకటే. ఎన్ని అబద్ధాలు నువ్వు చెబుతున్నా ప్రజలెవరూ నమ్మడం లేదు. ఒకటి మాత్రం వాస్తవం. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా.. మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా.. శాపనర్థాలు పెట్టినా.. పిల్లి శాపాలకు ఉట్లు తెగయ్. ఎన్ని రకాలు తట్టినా.. ఎంత చిత్ర విచిత్రంగా తట్టిన పరాక్ పడదు. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నయో.. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లపై వదిలిపెట్టం. నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతాం.. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి చెబుతున్నాం. శాసనసభా సమావేశాల సందర్భంగా సహకరించిన మీడియాకు ధన్యవాదాలు’ తెలిపారు కేటీఆర్.