KTR | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండాలని 1952లో పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది, 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి గెలిస్తే ఆ పార్టీని మాయం చేసిందెవరు? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ వల్లే తెలంగాణలో వేలాది మంది అమరులయ్యారని, అమరుల స్థూపం కట్టాల్సి వచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొకింది, 2004లో మాట ఇచ్చి, పదేండ్లు తాత్సారం చేసి వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానానికి కారణమైంది ఎవరు? అంటూ నిలదీశారు. రేవంత్రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు? అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.