KTR | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ స్వయంగా యువతను, నిరుద్యోగులను కలిసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని ఎక్స్‌వేదికగా కేటీఆర్ గుర్తుచేశారు.
అన్ని ప్రధాన పత్రికల్లో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలను సైతం విడుదల చేశారని పేర్కొన్నారు. జాబ్‌క్యాలెండర్, ఉద్యోగాల భర్తీని తేదీలతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తుచేశారు. ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయిందని, కానీ ఒక కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 10 నోటిఫికేషన్ తేదీల గడువు ముగిసిపోయిందని పేర్కొన్నారు.
మిగిలిన ఐదు నెలల కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏవిధంగా జారీ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో బాధ్యత తీసుకొని స్పందించకపోవడం వల్లనే రాహుల్‌గాంధీని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. రాహుల్‌గాంధీ అయినా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
సీఎస్ శెట్టికి కేటీఆర్ శుభాకాంక్షలు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా నియామకం కానున్న తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆదివారం ఎక్స్ వేదిక హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్ద పోతులపాడు సీఎస్శెట్టి స్వగ్రామం. ఎనిమిది నుంచి ఇంటర్ వరకు గద్వాలలో పూర్తిచేశారు.