KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వల్ల, ఏకపక్ష నియంతృత్వ పోకడలతో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సంస్థకు హైద్రాబాద్ మెట్రో విషయంలో 2070 దాకా లీజు ఉంది అంటే 45 ఏండ్లు ఇంకా సమయం ఉంది. ఇవాళ ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయిందో సీఎం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ నుంచి ఆ సంస్థ వెళ్లిపోయిందంటే అది తెలంగాణ రాష్ట్రానికి మాయని మచ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నిన్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని చాలా బాధ్యతరాహిత్యంగా, ఆలోచనరహితంగా తీసుకుంటే.. అదేదో గొప్ప పని అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వార్తా పత్రికలు, ప్రసార మధ్యామాలు రాశాయి. తప్పుడు కథనాలు రాసిన పత్రికలకు, ప్రజలకు సమగ్రంగా చెప్పాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
2014లో మేం బాధ్యత తీసుకున్నప్పుడు మెట్రో పనులు కేవలం 25 శాతం మాత్రమే పనులు అయ్యాయి.. 2008లో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్షిప్లో మెట్రో కోసం టెండర్లు పిలిచారు. మెటాస్ సంస్థ వచ్చింది.. చాలా ఆశ్చర్యంగా పత్రికలు రాశాయి. ఈ సంస్థ ఉల్టా ప్రభుత్వానికి పైసలు ఇస్తదని రాశారు. మెట్రో లాభసాటి అని చెప్పడానికి ప్రయత్నించాయి. ఆ సంస్థ వెనక్కిపోయి ఎల్ అండ్ టీ టెండర్ తీసుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్ షిప్ భాగస్వామ్యంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ పిలిచి ఫైనల్ చేసి ఎల్ అండ్ టీకి అప్పగించింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి పని మెట్రో పనులు 25 శాతం పూర్తయ్యాయి. కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ప్రజా రవాణను మెరుగుపరచాలని, ఐటీ ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మెట్రోను త్వరితగతిన పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగులు మూడు రెట్లు పెరుగుతారని, ఉజ్వల నగరంగా పెరుగుతుందని చెప్పి నాడు కేసీఆర్ మొత్తానికి 2017 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి చేశాం. ప్రధానిని ఆహ్వానించి నవంబర్ 29న 2017న ప్రారంభించాం అని కేటీఆర్ తెలిపారు.
ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. ప్రజా రవాణా స్తంభించిపోయే పరిస్థితి. మళ్లీ ఎల్ అండ్ టీ వారు కంగారు పడ్డారు. వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి.. 2070 దాకా నడపాలని ధైర్యం చెప్పి ప్రభుత్వం నుంచి సాఫ్ట్ లోన్ కింద రూ. 900 కోట్లు కేబినెట్ అనుమతితో ఇచ్చాం. ఎల్ అండ్ టీ ముందుకు పోయింది. పీక్ అవర్స్‌లో సరిపోవట్లేదు కోచ్‌లో పెంచండి అని అడిగారు. అందుకు అనుగుణంగా కోచ్‌లు కూడా పెంచామని కేటీఆర్ తెలిపారు.
69 కిలోమీటర్లు మెట్రోను పూర్తి చేశాం పాతబస్తీ మినహా. హైటెక్ సిటీ ఆవాస హోటల్ వద్దకే మెట్రో ఉంటే.. ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని దాన్ని రహేజా మైండ్ స్సేస్ వరకు పొడిగించాం. అర్ధవంతంగా, ఆలోచనతో మెట్రోను పూర్తి చేశాం. రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ దేశంలో రెండో అతిపెద్ద వ్యవస్థ మేం దిగిపోయ నాడు. ఇంకో పని చేశాం. దిగపోయే ఆరు నెలల ముందు.. మెట్రో నగరాల్లో ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉందని ఆలోచన చేసి.. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్‌కు ఓఆర్ఆర్ వెంట టెండర్ పూర్తి చేశాం. శంకుస్థాపనం చేశాం. ఎల్ అండ్ టీ టెండర్ దక్కించుకుంది.. పనులు ప్రారంభించడమే మిగిలి ఉండే. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు కారిడార్‌కు స్థలం సేకరించి పెట్టారు వైఎస్సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని.. శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్రయత్నం చేశాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రజా రవాణా మెరుగుపరచాలనుకున్నాం. శంషాబాద్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి పని చేసుకునేందుకు ఆలోచన చేశాం.. 37 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రోకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేసీఆర్ కేబినెట్ పచ్చజెండా ఊపింది. 160 కిలోమీటర్లు ఓఆర్ఆర్ చుట్టూ, ఇక మితగాది భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ దాకా కేబినెట్ ఆమోదం ఇచ్చాం. దశల వారీగా చేస్తామని చెప్పాం. ప్రజా రవాణాకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మెట్రోను కాపాడుకుంటూ, విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ.. సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోయాం. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మొదట్టమొదటి నిర్ణయం.. ఎయిర్ పోర్టు మెట్రోను అనాలోచితంగా రద్దు చేశారు. ఈ పాటికి అయిపోయేది.. రెండేండ్లు దాని టర్మ్. కేటీఆర్ భూములు ఉన్నాయట అని పిచ్చి ఆలోచనలతో ఎల్ అండ్ టీకి దెబ్బ కొట్టారు. వాళ్లను వెళ్లగొట్టారు. అక్కడ్నుంచి రేవంత్ రెడ్డికి ఎల్ అండ్ టీకి పంచాయతీ మొదలైంది అని కేటీఆర్ గుర్తు చేశారు.