KTR | హైదరాబాద్ : తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచించడమే దుస్సాహసం అన్నారు. శూన్యం నుంచి సునామీని సృష్టించినట్టుగా తెలంగాణ రానే రాదన్న అనుమానాలను పటాపంచలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అన్నారు. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని కేసీఆర్ను ప్రజాకవి గోరటి వెంకన్న ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. మహేంద్ర తోటకూరి రచించిన ప్రజా యోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన కేటీఆర్, భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితమని, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్ కి ఇది గొప్ప కానుక అన్నారు.
కేసీఆర్ అప్పులు చేశారని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెంప దెబ్బ లాంటి సమాధానాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు కేటీఆర్. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ. 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమే అని సాక్షాత్తు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాక, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అప్పుల పేరుతో కేసీఆర్ను కాంగ్రెస్ బద్నాం చేస్తుందన్నారు కేటీఆర్. కేంద్రం చెప్పిన ఆ లెక్కలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, తెలంగాణ ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అన్న కేటీఆర్, వ్యవసాయంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారని తెలిపారు. భారతదేశంలో మొదటిసారి ఇంటింటికి నల్లానీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని తీర్చడంతో పాటు నల్గొండలో ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం పెట్టి రూ. 73 వేల కోట్లను 70 లక్షల మంది రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు స్వతంత్ర్య భారత చరిత్రలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎదుర్కుని అత్యద్భుతంగా పనిచేసిన నాయకుడిని బద్నాం చేస్తున్న కాంగ్రెస్ చిల్లర ప్రయత్నాలను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.