KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10.40 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కేటీఆర్‌ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను పలు అంశాలపై విచారించారు ఈడీ అధికారులు. ఇక కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి.. వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యే ముందు.. కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫార్ములా-ఈ కార్ రేస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఫార్ములా రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి నయా పైసాకూ లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
KA Paul | మోదీ, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా నాకు తప్ప ఎవరికీ లేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Himanshu Rao | తాత అడుగుజాడల్లో హిమాన్షు రావు.. వ్యవసాయ క్షేత్రంలో ఏం చేశాడో తెలుసా..?
Revanth Reddy | ఇక ఢిల్లీని ఉద్ధరిస్తడట.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గప్పాలు..!