మేడ్చల్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా కేసీఆర్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌కే ఉన్నదని, కాంగ్రెస్‌కు ఆ సత్తా లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను ప్రధాని మోదీ పదేండ్లుగా తేల్చడం లేదని విమర్శించారు. ఇటివల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృష్ణా జలాలను తాకట్టు పెట్టి వచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి కృష్ణా జలాలను అప్పగించారని మండిపడ్డారు.
కృష్ణా నదిపై ప్రాజెక్ట్ కట్టాలన్నా, చుక్కనీరు తీసుకోవాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిని రేవంత్‌రెడ్డి కల్పించారని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణ హక్కులను సాధించుకోవాలన్నా, కాంగ్రెస్, బీజేపీని నీలదీయాలన్నా పార్లమెంట్లో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉండాలని వివరించారు. కేంద్రం నుంచి మన హక్కులను సాధించుకోవడం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలతో సాధ్యం కాదని పేర్కొన్నారు. మన హక్కుల కోసం, కృష్ణా జలాల కోసం కొట్లాడుతున్నది బీఆర్ఎస్ ఎంపీలేనని చెప్పారు. కేంద్రం నుంచి రాజ్యంగబద్ధంగా రావాల్సినవన్నీ వస్తాయని, ఇంకా అదనంగా సాధించుకోవాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీలకే ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, దీనితో వాటిని అమలు చేసే ఉద్దేశం లేదని చెప్పినైట్టెందని పేర్కొన్నారు. 420 హామీలను అమలు చేయలేనని చెప్తున్న ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కోడళ్లకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పారని, రాష్ట్రవ్యాప్తంగా కోటీ 57 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, హెల్త్‌సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ మాట్లాడుతూ.. కేటీఆర్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.