ఇటు పాత బాసు (చంద్రబాబు)ను మెప్పించాలి.. అటు కొత్త బాసు (మోదీ)ని ఒప్పించాలన్నట్టుగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నడు. అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వదని తెలిసినందునే కేంద్ర బడ్జెట్ ఉన్న రోజే కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ బ్లాక్ మెయిలరేనని, కాంగ్రెస్‌లో ఎవరినడిగినా ఈ విషయం చెప్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్టీఐ పేరుతో ఓ 50 మంది రిటైర్డ్ అధికారులతో ఆఫీస్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డ చరిత్ర రేవంత్‌రెడ్డిదని విరుచుకుపడ్డారు. బ్లాక్ మెయిలర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో చెప్పాలని, మహేశ్‌కుమార్ గౌడ్ ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు. పద్నాలుగేండ్లు అలుపెరుగని పోరాటం చేసి.. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసుల పేరిట వేధిస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మహోన్నత నేతపై కక్ష సాధింపులను తెలంగాణ సమాజం సైతం సహించబోదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి వచ్చిన కేసీఆర్‌పై వెల్లువెత్తిన సంఘీభావమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు.
అర్ధరాత్రి కూడా వేలాదిగా తరలివచ్చి కేసీఆర్‌పై ఘనమైన అభిమానాన్ని చాటుకొన్న బీఆర్ఎస్ సైనికులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్క ఉదుటున రోడ్లపైకి రావడం రాష్ట్ర సాధకుడు, ఉద్యమ సేనాని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అచంచల విశ్వాసానికి తార్కాణమని పేర్కొన్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ సర్కార్ వేధింపులపై కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 700 చోట్లకు పైగా రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తుచేశారు. సిట్ విచారణ ముగిసే వరకు నందినగర్, తెలంగాణ భవన్ వద్దే ఉండి కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. సోమవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫోన్ ట్యాపిం గ్ కేసులో కేసీఆర్ విచారణ, ఈ సందర్భంలో ఆయనపై వెల్లువెత్తిన అభిమానం.. సిట్ చీఫ్ సజ్జనార్ అసంబద్ధ వైఖరి, రేవంత్‌రెడ్డి కక్ష సాధిస్తున్న తీరు.. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయం.. కోఠిలో జరిగిన లూటీ, ఓ పత్రిక వ్యవహారశైలి ఇలా అనేక అంశాలపై ముచ్చటించారు.
‘తెలంగాణ ఉద్య మ రోజుల్లో ఎలాంటి స్పందన ఉండేదో.. ఆదివారం మరోసారి అలాంటిది కనిపించింది. అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ల నడుమ కూడా కార్యకర్తలు స్పందించిన తీరు అద్భుతం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాలు, పట్టణాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ప్రజలు తమ అభిమాన నాయకుడిపై అచంచలమైన విశ్వాసం, అభిమానాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ తెచ్చిన నాయకుడిని ముట్టుకుంటే.. పనికిమాలిన కేసుల పేరుతో వేధిస్తామంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.
రేవంత్ వృత్తే బ్లాక్ మెయిలింగ్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ను బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసలు బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడరే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వృత్తే బ్లాక్ మెయిలింగ్. ఆర్టీఐ పేరుతో 50 మంది రిటైర్ అయినవాళ్లతో ఆఫీస్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డ చరిత్ర రేవంత్‌రెడ్డిది. రేవంత్ బ్లాక్మెయిల్ దందా గురించి కాంగ్రెస్‌లో ఎవరినడిగినా చెప్తరు. ముఖ్యమంత్రి పదవిని కూడా బ్లాక్ మెయిల్ చేసే తెచ్చుకొని ఉంటడు. మహేశ్‌కుమార్ గౌడ్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.
డైవర్షన్ కోసమే సిట్ డ్రామా
సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ సోదాహరణంగా వివరించారు. మేడారం జాతర నిర్వహణలోనూ సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. గొప్పలకు పోయి క్యాబినెట్ మీటింగ్‌ను మేడారంలో పెట్టారని ఎద్దేవాచేశారు. కానీ, భక్తులకు సౌకర్యాలు, అక్కడ చేసిన ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు ఇబ్బంలకు గురయ్యారని వాపోయారు. జాతర నిర్వహణ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ను వేధించేందుకే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను వాడుతున్నట్టు ఉన్నదని, కేసీఆర్‌ను సిట్ విచారించే సందర్భంగా అధికారికంగా 900 మంది పోలీస్ సిబ్బందిని ఉపయోగించారని, అనధికారికంగా దీనికి రెట్టింపు మందిని వినియోగించారని చెప్పారు. రాజకీయ వేధింపులకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటుండటంతో మరోవైపు నగరంలో యథేచ్ఛగా పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయని, కోఠిలోని బ్యాంకు ఏటీఎం వద్ద పొద్దున్నే గన్‌తో కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లారని, చందానగర్‌లో పట్టపగలు దోపిడీదొంగలు స్వైరవిహారం చేశారని చెప్పారు.
పోలీసులు దొంగలను పట్టుకొనే పని వదిలివేసి రాజకీయ కక్ష సాధింపుల వ్యవహారంలో పావులుగా మారిపోతున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ విచారణ అని విమర్శించారు. నల్లమలసాగర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ నీళ్లు మళ్లించుకువెళ్తుంటే తెలంగాణ సీఎం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చున్నారని, తన పాత బాసుకు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. ‘ఇటు పాతబాసును మెప్పించాలి.. అటు కొత్తబాసు (మోదీ)ని ఒప్పిం చాలి అన్నట్టుగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఎద్దేవాచేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వదని తెలిసే కేంద్ర బడ్జెట్ ఉన్న రోజునే కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోవడం రేవంత్‌రెడ్డి అసమర్థపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. 62 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆయన కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా తెలంగాణకు తేలేదని, ఆయన ఢిల్లీకి వెళ్లింది పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టేందుకేనని, బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమేనని దెప్పిపొడిచారు.
రాష్ట్ర ప్రయోజనాలపైనే కేసీఆర్ ధ్యాస..
కేసీఆర్ ఆదివారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే సమయంలో కూడా కేంద్ర బడ్జెట్‌పైనే చర్చించారని, రాష్ర్టానికి ఈసారి కూడా ఏమీ ఇవ్వకపోవడంపైనే స్పందించారని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ ధ్యాస రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం గురించే ఉంటుందని తెలిపారు. సిట్ విచారణ పేరుతో ప్రభుత్వంలోని కొందరు ఏదేదో లీకులిచ్చి పైశాచికానందం పొందారని, అవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు.
భయమెందుకు కిషన్రెడ్డీ?
సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేవలం డిపార్ట్మెంటల్ కమిటీ వేసి చేతులు దులుపుకొన్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్‌రెడ్డి దోపిడీపై దర్యాప్తు చేయాలంటే కిషన్‌రెడ్డి భయపడుతున్నారా? అని నిలదీశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిందని, సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. సింగరేణి అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేవలం డిపార్ట్మెంటల్ కమిటీ వేశారని, దాంట్లో కూడా సింగరేణి సీఎండీ కన్నా నాలుగు ర్యాంకులు తక్కువ స్థాయి అధికారిని పెట్టారని, తన పైస్థాయి అధికారిపై ఆ కమిటీ నివేదిక ఇవ్వగలుగుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ద మ్ముంటే సింగరేణి అవినీతి, అవకతవకలపై శ్వేతప త్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12 ఏం డ్లుగా కనీసం మీడియాను కూడా ఎదుర్కోలేని నాయకుడున్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డికి బీఆర్ఎస్ను విమర్శించే అర్హతలేదని దెప్పిపొడిచారు.
దావోస్ పెట్టుబడులపై చర్చకు సిద్ధమా?
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడుసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారని, 2024లో తొలిసారి వెళ్లినప్పుడు ఆయన ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఒక్కటంటే.. ఒక్కటైనా రాష్ట్రంలో గ్రౌండింగ్ అయ్యిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 2024 జనవరిలో దావోస్ పర్యటనలో లక్షా 42 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యాయో చెప్తుందా? అని నిలదీశారు. ‘జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివసించే వీధి పక్కనే ఉండే మరోవీధిలో ఉండే మేఘా కృష్ణారెడ్డితో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారు. ఈపాటి ఒప్పందానికి దావోస్ దాకా ఎందుకు వెళ్లారు?’ అంటూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏకంగా తన సహచర మంత్రి కంపెనీతో దావోస్‌కు వెళ్లి ఒప్పందం చేసుకున్నారని, ఇదో నవ్వులాటలా మారిందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేతలు కార్తీ చిదంబరం, రాజీవ్ శుక్లా, జైరాం రమేశ్ వంటివారు దావోస్ పెట్టుబడులు ఉత్తుత్తవే అని మాట్లాడారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డేమో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారని, వస్తున్న పెట్టుబడులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. లక్షల కోట్లు కేవలం పేపర్లపైనే ఉంటున్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దావోస్ పెట్టుబడులపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
సిట్-1 ఫెయిలైనందుకే సిట్-2
ఫోన్‌ట్యాపింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సిట్-1 వేసి ఫెయిల్ అయిందని, ఇప్పుడు సిట్ 2 వేసిందని, ఇది కూడా ఫెయిల్ అయ్యిందని, ఇక సిట్ 3 వేస్తుందో లేదో తెలియదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘ఇక సిట్ విచారణలో ఏం చెప్పారు.. ఏం చెప్తున్నారంటూ ఉన్నవిలేనివి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సీఎంవో కేంద్రంగా ఒక అధికారిక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయడం దారుణం. సిట్ విచారణ గదిలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ లీకులిస్తున్నారు. అధికారులను బెదిరించారంటూ కూడా ప్రచారం చేశారు. తెలంగాణ రైజింగ్ పేరుతో పెట్టిన వాట్సాప్ గ్రూపు నుంచే ఇదంతా పెడుతున్నారు. సీఎంవోకు చెందిన అన్వేష్ రెడ్డి, కర్రి శ్రీరాం బీఆర్ఎస్పై దుష్ప్రచారం ఎలా చేయాలన్నది గ్రూపుల్లో పెట్టి మరీ చెప్తున్నారు’అని కేటీఆర్ మండిపడ్డారు.
సోషల్ మీడియా పోస్టింగ్‌పై సుప్రీంకోర్టుకు
శశిధర్ గౌడ్ (నల్లబాలు) సోషల్ మీడియాలో చేసిన ఒక రీట్వీట్‌పై తెలంగాణ ప్రభుత్వం పంతానికి పోయి సుప్రీంకోర్టు దాకా వెళ్లిందని, శశిధర్‌గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం 20 రోజులపాటు జైల్లో పెట్టిందని కేటీఆర్ తెలిపారు. హైకోర్టులో బెయిల్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, సుప్రీం కోర్టు సోమవారం ప్రభుత్వ అప్పీల్ కొట్టివేసిందని చెప్పారు. ‘వెదవ పనులు చేయడం, మళ్లీ దాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది’ అని దుయ్యబట్టారు. ప్రజల హక్కులను కాపాడేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తంచేయడంతో పాటు ధన్యవాదాలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడికక్కడే ప్రచారాలు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తంచేశారు. హడావుడి కార్యక్రమాలేమీ లేవని, జిల్లాలు, నియోజకవర్గాలవారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. స్థానిక నాయకత్వమే అక్కడి బాధ్యతలు తీసుకుంటుందని, ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్తామని చెప్పారు. రోడ్‌షోలు, సభలు పెట్టుకోలేదని తెలిపారు. అద్భుతమైన ఫలితాలే వస్తాయని, ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామని చెప్పారు. గట్టిపోటీ ఇస్తామని, ఓటింగ్ పర్సంటేజీ, కౌన్సిలర్ల సంఖ్య చూడాలని, గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. విలేకరులు సిర్పూర్, షాద్‌నగర్‌ల గురించి ప్రశ్నించగా ఆ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
బడ్జెట్లో బీజేపీ ఇచ్చిందేం లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చిందేం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అన్ని జిల్లాల్లో బాలికలకు వసతి గృహాలు ఇస్తామని చెప్పిందని, కానీ,తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ప్రతి మండలంలో బాలికలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి సెమీకండక్టర్ల గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడిందని, 2018లోనే తెలంగాణలో సెమీ కండక్టర్లు, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రానిక్స్ పాలసీని తెచ్చామని తెలిపారు. నిధుల కోసం 62 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సాధించింది గుండు సున్నా అని దెప్పిపొడిచారు. కేవలం తన మీద ఉన్న వ్యక్తిగత కేసులను మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతల కాళ్లమీద పడేందుకు, కాంగ్రెస్ నాయకులకు దక్షిణ సమర్పించుకునేందుకే వెళ్తున్నాడని ఎద్దేవాచేశారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్ కావాలని, ఇక్కడ పద్మశాలీలు, నేతన్నలకు ఆసరాగా ఉంటుందని పదేండ్లుగా అడుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. అదే మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాలకు మాత్రం మెగా పవర్‌లూం క్లస్టర్ ఇచ్చారని చెప్పారు. దీనిపై బీజేపీ స్థానిక పెద్ద నేతలు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైస్పీడ్ రైలు కూడా ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చిందేం కాదని, పైన మొదలయ్యే రైలు కింది రాష్ర్టాలకు తెలంగాణ గుండా వెళ్తుందని, దీనివల్ల ఇక్కడికి ఉండే ప్రత్యేక లాభం ఏమీలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ్భారత్ మిషన్‌కు కూడా నిధులు తగ్గించారని వివరించారు.
సబ్సిడీల్లో కోత.. నాటి పథకాల కాపీ
ఆహార సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలకు కూడా కోత పెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణను కాపీ కొట్టి కొన్ని పథకాలను పెట్టారని, డేటా సెంటర్ల మీద 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పారని, కానీ, తెలంగాణ ఈ విధానాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నదని చెప్పారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా అనేక సంస్థలు తమ డేటాసెంటర్లను హైదరాబాద్‌లో పెట్టేలా చేశామని గుర్తుచేశారు. దేశానికి డేటా సెంటర్ల విషయంలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. దేశంలో బయోఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు ఇస్తున్నామని కేంద్రం చెప్పిందని, కానీ, దీంట్లో తెలంగాణకు వచ్చే లాభమేమీ లేదని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద ఫార్మా పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంటే.. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బయోఫార్మా రంగానికి నిధులివ్వకపోవడం తెలంగాణపై వారికున్న ప్రేమకు నిదర్శనమని మండిపడ్డారు.
ఆత్మగౌరవంపై ఆ మీడియా మాట్లాడుడా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించింది, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది ముమ్మాటికీ కేసీఆరేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఆ పత్రిక (ఆంధ్రజ్యోతి)లో రాసినాయనకు ఏమైనా అనుమానాలుంటే ఉండొచ్చు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవు. రాసినాయన (వేమూరి రాధాకృష్ణ)కు వ్యక్తిగత ఎజెండాలుంటే ఉండొచ్చు. ఒక అంశాన్ని తీసుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఆపాదిస్తున్నరు. రెండేండ్లలో రాష్ట్ర పాలనా తీరుతెన్నులు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, పాలనా వైఫల్యాలపై ఎన్నిసార్లు రాశారు? ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్న తీరును ఏనాడైనా తన పత్రిక ద్వారా ఎండగట్టారా? సదరు మీడియా అధిపతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్తే ప్రజల సమస్యలు తీరిపోయినట్టేనా? బీఆర్ఎస్ ఎవ్వరికీ తొత్తుగా పనిచేయదు. బీఆర్ఎస్ ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు బానిసగానే ఉంటది. ఢిల్లీకి గులాములం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను ముట్టుకుంటే డెఫ్‌నెట్‌గా తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్టే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టినట్టే.. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని విస్పష్టంగా చెప్పారు.
సజ్జనార్.. ఆధారాలుంటే కోర్టు ముందు పెట్టండి
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ కేసు అని ట్వీట్ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ తనకు తెలిసినంత వరకు సజ్జనార్ జడ్జి కాదని, ఆయన వద్ద ఏమైనా ఆధారాలుంటే కోర్టులో సమర్పించాలని కేటీఆర్ సూచించారు. చిట్చాట్లు, ట్వీట్ల పేరుతో లీకులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇల్లీగల్ కేసు అని పోలీసులు రుజువు చేయాల్సి ఉంటుందని చెప్పారు. జడ్జి తీర్పు ఇవ్వాలని, సజ్జనార్ కాదని హితవుపలికారు. ఆయనకు ఆయనే జడ్జిమెంట్లు ఇస్తే కుదరదని, కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అధికారులకు అత్యుత్సాహం మంచిది కాదని సూచించారు.
ట్యాప్ చేయించాల్సిన కర్మ పట్టలే
రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఇంటెలిజెన్స్వారు ఎలా సమాచారమిస్తున్నారో.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాగే సమాచారం ఇచ్చేవారని కేటీఆర్ తెలిపారు. ‘ఫోన్లను వ్యక్తిగతంగా ట్యాప్ చేయించాల్సిన కర్మ మాకు పట్టలే. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినట్టు వచ్చిన వార్తలపై నేనే సిట్ అధికారులను ప్రశ్నించా. అలాంటిది ఏమీ లేదని అధికారులు స్పష్టం చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినామని ఏ ఒక్క బిజినెస్‌మన్ అయినా ఫిర్యాదు చేశారా? అంటే అదీ లేదు. ఫిర్యాదులు లేకపోయినా టీవీ సీరియల్లా సిట్ విచారణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కక్షతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి హరీశ్‌రావు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆ కేసును కొట్టివేసింది. ఇన్ని రోజులుగా ఉన్నవి లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసిండ్రు. ఇకనైనా దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ నేతలను కోరుతున్నా. మీడియా కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పిందేదో వేదం అన్నట్టుగా ప్రచారం చేయవద్దు. అది నిజమా? అబద్ధమా? అన్నది తెలుసుకోవాలి’ అని హితవుపలికారు.
11 ఏండ్లలో రూ.153 లక్షల కోట్ల అప్పు.. ఇదీ బీజేపీ ఘనకార్యం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 79 ఏండ్లలో బీజేపీ పాలనలోనే అత్యధికంగా అప్పులు చేశారని కేటీఆర్ వివరించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశ అప్పులు 55 లక్షల కోట్లు ఉంటే బీజేపీ వచ్చిన 11 ఏండ్లలోనే రూ.153 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. నెలకు సుమారు లక్ష కోట్లు మిత్తికే సరిపోతున్నదని దుయ్యబట్టారు.
డైరెక్టర్ శంకర్‌కు కేటీఆర్ పరామర్శ
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ మాతృమూర్తి సక్కుబాయి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోమవారం సాయంత్రం శంకర్ నివాసానికి వెళ్లారు. సక్కుబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శంకర్‌తోపాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమా ద్వారా గద్దర్ ఆటాపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించిన శంకర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దశదిన కర్మకు హాజరవుతానని హామీ ఇచ్చారు.