BRS Working President KTR | తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 1.60 కోట్ల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో పోస్టు పెట్టారు. `రేవంత్ రెడ్డి తెలంగాణ హామీలు అమలు చేశామంటూ మహారాష్ట్రలో చెప్పిన అబద్దాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుంది. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో జార్ఖండ్ ప్రజలు చూపించారు` అని వ్యాఖ్యానించారు.
`రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు` అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
`తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదు` అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. `తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 రూపాయలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి` అని విమర్శించారు.
`మహారాష్ట్రలో అదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలి` అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహా ఇచ్చారు.