KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో రెండేండ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు సరి చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. పరిగి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఒక్కటే చెబుతున్నా. పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఖైరతాబాద్‌లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కలిసి చిలుక పలుకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఎక్కువ సమయం లేదు. మరో రెండున్నరేండ్లలో మళ్లీ మేమే వస్తాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో.. రేవంత్ రెడ్డి కంటే ఎక్స్‌ట్రాలు చేసే వారందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత నాది అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను అద్భుతంగా తయారు చేసుకుంటూ వచ్చాం. తండాలను పంచాయతీలు చేస్తామని కాంగ్రెసోళ్లు చెప్పిన కాలేదు. కానీ కేసీఆర్ హయాంలో తండాలు పంచాయతీలు అయ్యాయి. కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ వికారాబాద్‌లో కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మన కలెక్టరేట్లను ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల్లోని సెక్రటేరియట్లు కూడా తెలంగాణలోని కలెక్టరేట్ల మాదిరి లేవన్నారు. ప్రతి గడప ముందుకు పాలన తీసుకొచ్చారు కేసీఆర్. ప్రతి ఊరిలో రైతు వేదిక, ప్రకృతివనాలు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకున్నాం. రైతులకు 24 గంటల ఉచితంగా కరెంట్ ఇచ్చారు. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
మనం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించడంలో మనం ఫెయిలయ్యాం. పదేండ్లలో సాధించిన ప్రగతిని చెప్పుకోలేకపోయాం. అవతలోడు వచ్చి ఆశచూపెట్టి గెలిచిండు. గెలిచాక ఏం చేస్తలేడు. కాంగ్రెస్‌ను నమ్మి ఇవాళ బాధపడుతున్నారు. కార్యకర్తల్లాగా మనం చేయాల్సిన పని ఒక్కటే. కేసీఆర్‌కు సీఎం కొత్త పదవి కాదు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్లీ 15 ఏండ్లు వెనక్కి పోయే ప్రమాదం ఉంది. అందుకే తెలంగాణను మళ్లీ పట్టాలెక్కించాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి. కార్యకర్తలందరం కలిసి పని చేద్దాం. వికారాబాద్ జిల్లాలో భూముల ధరలు తగ్గాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక మనిషి సంతోషంగా లేడు. తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు ఉందని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర లేదు. ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు. యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.