KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్లు గతేడాది డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే మూడేండ్లు రేసింగ్ నిర్వహిస్తామంటూ దాన కిశోర్‌కు ఆల్బర్టో లేఖ రాశారు. మరోసారి నిర్వహణపై డిసెంబర్ 21 లోపు స్పష్టత ఇవ్వాలని మెయిల్ పెట్టారు. రేసింగ్ రద్దు అయిపోగానే ఎఫ్ఎంఎస్ వాళ్లు రూ. 74 లక్షలు చెల్లించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచి పెడుతుందని కేటీఆర్ తెలిపారు.
మరి ఇందులో కరప్షన్ ఎక్కుందో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఏం కేసు ఇది.. హౌలాగాడు తప్ప ఎవడు పెట్టడు. రేవంత్ రెడ్డి చేసే లత్కోర్ పని ఇది. మా మీద కేసులు పెట్టి సతాయిస్తాం అంటే.. ఒక్కటి చెబెతున్నాం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం సైనికులు.. నీలాంటి చిల్లర కేసులకు భయపడేటోడు ఎవరూ లేరు. ఏం చేసుకుంటావో చేస్కో. రేవంత్ సర్కార్, ఫార్ములా ఈ మధ్య జరిగిన ప్రత్యుత్తరాలకు సంబంధించిన కాపీలన్నీ ఏసీబీ, పోలీసులు, కోర్టుకు ఇస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. బరాబర్ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. ఆత్మ విశ్వాసం ఎక్కువ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
అమృత్ స్కాం, మూసీ లూటీ, రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ల అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్సోపోజ్ చేస్తున్నాం.. కాబట్టి కడుపు మంటతో చేస్తున్నావ్.. అయినా ఏం భయపడం.. ఏం చేసుకుంటావో చేసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి రేస్ నిర్వహించాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ వారు ఉత్తరం రాశారు. లైసెన్స్ ఫీజు వాస్ తీసుకోమని లేఖలు రాశారు. అవి దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. అన్నింటికి మించి ఫార్ములా ఈ వాళ్లు ఆర్బిట్రేషన్ ద్వారా కొట్లాడుతున్నారు. వాళ్ల మీద కేసు వేస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా..? అని కేటీఆర్ నిలదీశారు.
కేసు పెట్టదలచుకుంటే పెట్టుకో.. కానీ తెలంగాణ పరువు తీయకు. మేం భయపడం.. లీగల్ గా ఎదుర్కొంటాం.. ఎలాంటి పరిస్థితిని అయినా శాంతియుతంగా ఎదుర్కొంటాం. ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపాం. రేవంత్ రెడ్డి చిల్లర ఎత్తుగడలకు పడిపోం. 100 శాతం శాంతియుతంగా ముందుకు వెళ్తాం. ఎన్ని డైవర్షన్ గేమ్స్ ఆడినా.. హామీలు అమలు చేసేదాకా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.