KTR : సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ బావమరిది కింగ్ పిన్ అని అన్ని ఆధారాలున్నా.. సిట్ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను అడిగిన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని చెప్పారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కుంభకోణంపై ప్రశ్నించారు. ‘‘రెండేళ్ల అసమర్ధ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారు. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను అడిగాను. సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్లు తెలుసా అని అడిగారు. అడిగిందే అడిగారు. తిప్పితిప్పి అడిగి చిరాకు పెట్టారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు.. వారి ఫోన్లను ట్యాప్ చేశామనే ప్రచారం నిజమేనా అని సిట్ ను అడిగా. మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని ప్రశ్నించా. మేం అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని సిట్ ను అడిగా. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారు. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారు.
సింగరేణి టెండర్ల దొంగలపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చినా.. చర్యలు ఎందుకు లేవు..? స్వయంగా మంత్రి కుమారుడు గూండాగిరి చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. సీఎం బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు లేదు. మమ్మల్ని విచారించడంపై లీకులు వండి మీడియకు ఇస్తారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేరకంగా ఉండాలి. ఈ రోజు నన్ను ఎవరితోనూ కలిసి విచారించలేదు. ఇవ్వాళ్టి విచారణలో నా పక్కన ఎవరూ లేరు. నేను తప్ప ఏ రావూ లేరు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.