హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ) : ‘పంచభూతాలను సైతం కాంగ్రెస్ నేతలు దోచుకుతింటున్నరు.. రాష్ర్టాభివృద్ధికి భూములిచ్చిన రైతులను నిస్సిగ్గుగా దోపిడీ చేస్తున్నరు.. బకాసురుడితో పోటీపడుతూ తెలంగాణ భూ ములను కాంగ్రెస్ నేతలు బుకపడుతున్నరు’ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల రైతులకు పరిహారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లస్థలాలను.. కాంగ్రెస్ నేతలు బలవంతంగా తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని బుధవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకొస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, భూములను తిరిగి అదే రైతులకు ఇస్తామంటూ గద్దెనెకిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడా విషయాన్నే మరిచిపోయిందని మండిపడ్డారు.
19,400 ఎకరాల్లో గ్రీన్ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ సత్సంకల్పానికి మద్దతుగా ఆనాడు భూములిచ్చిన రైతులకు తమ ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. పట్టా భూమికి ఎకరాకు రూ.16.5 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పరిహారంతోపాటు నిర్వాసితులకు కందుకూరు మండలం మీర్ఖాన్పేట పరిధిలో 1,400 ఎకరాల భూమిని కేటాయించిందని, దాదాపు 560 ఎకరాల్లో భారీ లేఅవుట్ను రూపొందించిందని గుర్తుచేశారు. రైతులు ఇచ్చిన ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలం చొప్పున పరిహారంగా ప్రకటించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి ఇండ్లస్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా పడిందని పేర్కొన్నారు. ఇప్పుడా ఆ భూములను కొల్లగొట్టే ఉద్దేశంతోనే రేవంత్రెడ్డి సరార్.. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వడమే లేదని విమర్శించారు. ఆ లేఅవుట్లలో నుంచే 330 ఫీట్ల గ్రీన్ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ ఖరారు చేసి.. రైతుల నోట్లో మట్టికొట్టారని కేటీఆర్ మండిపడ్డారు.
పరిహారంగా ఇచ్చిన భూములు కాంగ్రెస్ నేతలకు ఫలహారంగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడి రైతులను భయపెట్టి, ఆ భూములను అడ్డికి పావుశేరుకు కొనుకుంటున్నారని విమర్శించారు. బహిరంగ మారెట్లో ఒక చదరపు గజం రూ.30 వేలు ఉంటే.. కాంగ్రెస్ నేతలు రైతులను బెదిరించి రూ.4 వేలు, రూ.5 వేలకే కొంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే భూములు తిరిగి ఇస్తామన్న రేవంత్ సరార్, వారికి హకుగా రావాల్సిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతున్నా చూస్తూ ఊరుకుంటుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు భూములను తిరిగి అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.