హైదరాబాద్, నవంబర్ 25 (నమ స్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన ఆ పార్టీ, పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శనివారం ఏఎన్ఐ వార్తసంస్థతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడికే పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పీవీ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా అవమానించిన సంగతిని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. దేశ నాయకుడికి ఢిల్లీలో మెమోరియల్ కూడా నిర్మించకుండా అడ్డుకున్నది కాంగ్రెసే కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతిని ఘనంగా జరిపిందని, గొప్పగా గౌరవించుకున్నదని, భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని గుర్తుచేశారు.