KTR | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ‘మందిది మంగళవారం.. మనది సోమవారం’ ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరితే గగ్గోలు పెడుతున్న ఆ పార్టీ పెద్దలు, మరికొన్ని రాష్ర్టాల్లో మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వనీతికి హర్యానా, తెలంగాణ రాష్ర్టాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కిరణ్‌చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పెడబొబ్బలు పెడుతున్నారు.
తొషమ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బీజేపీలో చేరారు. దీంతో ఆమెపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని సెక్షన్ 2(1)(ఏ) ప్రకారం ఒక పార్టీ నుంచి గెలిచి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు అనర్హత వేటుకు పడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ఆమెపై అనర్హత వేటు వేయాలని సీఎల్పీ నేత అఫ్తాబ్ అహ్మద్, చీఫ్ విప్ బీబీ బత్ర స్పీకర్‌కు లేఖ రాశారు.
కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకొని బీజేపీలో చేరిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవిలో కొనసాగే అర్హత లేదని ఈ లేఖలో పేర్కొన్నారు. ఫిరాయింపుల విషయంలో గతంలో కిహోటో హొల్లొహన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీరు ప్రస్తావించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో అంతర్లీనంగా రీకాల్ చేసే శక్తి ఉంటుందని పేర్కొన్నారు. అనైతిక ఫిరాయింపులను రాజకీయ, సామాజిక దురాచారంగా అభివర్ణించారు.
హర్యానాలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. దీంతో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. పదవీకాలం దాదాపుగా పూర్తి కావొచ్చినప్పటికీ కిరణ్ చౌదరి పార్టీ ఫిరాయింపును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతున్నది. ఆమెకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని అంటున్నది. మరోవైపు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటూ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ జై కొడుతున్నది. బీఆర్ఎస్ తరఫున పోటీచేసి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నది. తాజాగా మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాలో ఒక్క ఎమ్మెల్యే ఇతర పార్టీలో చేరితే ఫిరాయింపు చట్టాలంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్‌కు ఇక్కడ మాత్రం ఎలాంటి ఫిరాయింపు చట్టాలు గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. లేదంటే, ఆ పార్టీకి తెలంగాణలో ఫిరాయింపు చట్టం వర్తించదా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇలా రాష్ర్టానికో నీతి పాటించడం, ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ ద్వంద్వనీతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. హర్యానాలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ట్విటర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ ఆ పార్టీ విధానాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకోవడంపై ప్రశ్నించారు. ‘హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతర పార్టీలో చేరితే వరదలు పారేలా ఏడుస్తున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వస్తే విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇదేం ద్వంద్వ నీతి? రాహుల్‌గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతావు’ అని ప్రశ్నించారు.