హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అదనపు భారం మోపుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సీఎం రేవంత్రెడ్డి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా, ఇలా సామాన్యులపై భారం మోపడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు. హైడ్రా వంటి దికుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక ప్రజలపై అదనపు భారం మోపడం దుర్మార్గమైన చర్య అని శనివారం ఓ ప్రకటనలో అభివర్ణించారు.
గ్యారెంటీలను గాలికొదిలి కోట్ల వసూలుకు కుట్ర
రహదారి భద్రతా సెస్ పేరిట ఒకో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలుచేస్తామన్న గ్యారెంటీలను రెండేండ్లయినా పట్టించుకోకుండా గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముకుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్రకు కాంగ్రెస్ సర్కారు తెరతీసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సరారును తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. పైసాపైసా కూడబెట్టుకొని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసేవారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు రేవంత్రెడ్డి సర్కారు ఇకనైనా ముగింపు పలకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవుపలికారు.