హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహంభావంతో తెలంగాణకు రూ. 15,000 కోట్ల నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడంతో ఆ సంస్థ కోసం తెచ్చిన రుణంతో పన్నుదారులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చేతగానితనంతో రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆదివారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్‌సిటీ వైపు మెట్రోను మళ్లించే నెపంతో ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రోరైల్‌ను రద్దుచేశారని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అనవసర రాద్ధాంతం చేసి ఎల్‌అండ్‌టీపై అక్రమ కేసులు నమోదు చేస్తామని, సంస్థ ఎఫ్ఎల్వోను జైల్లో పెడతానని బెదిరించారని గుర్తుచేశారు. ఆయన అరాచకాలు భరించలేకే ఎల్అండ్టీ రాష్ట్రం నుంచి వెనక్కివెళ్లిపోయిందన్నారు. ‘కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ స్తంభించిపోయింది. ఆరు గ్యారెంటీల కార్డు అటెకెక్కింది’అంటూ విమర్శలు గుప్పించారు.
‘మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి నేటికి ఏడాదైనా ఏం దొరికిందో, ఎంత నల్లధనం పట్టుబడిందో ఎందుకు చెప్పడంలేదు? ఈడీ అధికారులు, రాష్ట్ర మంత్రి, కేంద్రంలోని బీజేపీ ఎందుకు నోరుమెదపడంలేదు? మంత్రి ఇంట్లోకి కరెన్సీ లెక్కింపు యంత్రాలు పంపినట్టు వార్తలు వచ్చాయే తప్ప తేల్చిందేమీలేదు’ అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఏడాదైనా ఈ వ్యవహారం బ్రహ్మరహస్యంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడం విడ్డూరమన్నారు. ఇంత గొప్ప ఘనత సాధించి విజయవంతంగా వాషింగ్ మెషిన్‌ను నడుపుతున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలాసీతారామన్, ఈడీ బృందానికి నా అభినందలు అని ఎద్దేవా చేశారు. పొంగులేటి ఇంటిపై దాడుల తదనంతరం పరిణామాలే బీజేపీ, కాంగ్రెస్ మధ్య అపవిత్ర బంధానికి నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 28 : ఎస్సీ వర్గీకరణ చట్టంతో మాల సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని మాల సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తంచేసింది. ఆదివారం మాల సంఘాల జేఏసీ చైర్మన్ మం దాల భాస్కర్ అధ్యక్షతన నిర్వహిం చిన రాష్ట్ర మాల సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవగాహన రాహిత్యంతో చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం మాల సామాజిక వర్గాన్ని తీవ్రంగా నష్టపరుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోకుండా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.