KTR | హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌పై కర్ణాటక బిజెపి నేతలు విరుచుకుపడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ విచిత్రంగా అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని మాత్రం తెలంగాణ బిజెపి నేతలు ఒక్క మాట అనడం లేదు. తెలంగాణ బిజెపి నేతలు అంతా మౌన మునుల్లాగా మారిపోయారు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇది కాంగ్రెస్, బిజెపిల మధ్య ఉన్న అపురూపమైన సంబంధానికి నిదర్శనం. తెలంగాణ బిజెపి ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా? కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ బిజెపి నేతలు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు రేవంత్ సపోర్ట్ చేస్తున్నందుకే మౌనమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిపి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఇప్పటిదాకా అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి వైపు నుంచి కానీ ఒక్క ప్రకటన కూడా రాలేదు. కాంగ్రెస్ మంత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు, అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎందుకు మొహమాటం..? కాంగ్రెస్ మంత్రులను మోడీ ఎందుకు కాపాడుతున్నారు..? పొంగులేటి ఇంట్లో డబ్బులు లెక్కబెట్టడానికి కౌంటింగ్ మిషన్లను కూడా తీసుకపోతున్న విజువల్స్ మీడియాలో వచ్చాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో బిజెపి స్పందించలేదు అని కేటీఆర్ తెలిపారు.
రూ. 187 కోట్ల వాల్మీకి కుంభకోణంలో కర్ణాటకలో అరెస్టులు జరిగాయి. అందులో రూ. 45 కోట్లు తెలంగాణకు బదిలీ అయ్యాయి. ఆ రూ. 45 కోట్లు అందుకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదు. వాళ్లను విచారించాలని ఇప్పటిదాకా ఈడీ అనుకోలేదు. రూ. 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేరాయని రిమాండ్ డైరీలో ఈడీ రాసింది. ఆ డబ్బులను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వాడారు అని స్పష్టం చేసింది. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కుతో వాల్మీకి స్కాం కూడా బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
2024 మే 10న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని రాహుల్ – రేవంత్ రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సివిల్ సప్లై స్కామ్‌లో జరిగిన కుంభకోణాన్ని మేము ఆధారంతో సహా బయటపెట్టాం. ఈ సివిల్ సప్లై స్కామ్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు. కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవి కూడా విచారణ జరపడానికి ముందుకు రావడం లేదు అని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోయినా రూ. 1137 కోట్ల విలువైన అమృత్ టెండర్లను అక్రమంగా కేటాయించారని మేము స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా కనీసం ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ ఎంపవర్ కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చింది చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్ష నేతలపై మెరుపు వేగంతో స్పందించే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు ఇక్కడ కాంగ్రెస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అని కేటీఆర్ సూచించారు.
అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి బామ్మర్దిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ టాక్స్ పేరుతో బిల్డర్ల దగ్గర రూ. 200లు వసూలు చేస్తున్నా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. సివిల్ సప్లై స్కామ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే. సెంట్రల్ ఎంపవర్ కమిటీ రికమండేషన్ ఇచ్చిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులోనైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కలిసి మేము కోరుతాం. ఇన్ని రోజుల నుంచి రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెల రోజుల తర్వాత మా కార్యాచరణను ప్రకటిస్తాం. బిజెపిని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగడతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.