KTR | హైదరాబాద్ : గ్యారెంటీల ప్రభావంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హిమాచల్‌లో గంజాయి సాగుకు అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
గ్యారెంటీలు అమలు చేయలేక గంజాయి సాగా..? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటదా? అని కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా మీ పార్టీ జాతీయ విధానం అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
Thought this must be a joke when I saw it but guess the joke is on all those who voted for Congress
Is this the national policy of your party @RahulGandhi Ji?
“గ్యారెంటీలు” అమలు చేయలేక “గంజాయి సాగా”? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటదా? pic.twitter.com/X0naCXg18G
— KTR (@KTRBRS) September 10, 2024
హిమాచల్ ప్రదేశ్‌లో నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేసేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ సైతం వ్యతిరేకించపోవడం గమనార్హం. రాష్ట్రంలో గంజాయి సాగుకు గత ఏడాది అసెంబ్లీలో చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు తెలిపారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారెంటీలు ఇవ్వడంతో రాష్ట్రం మరింత దివాలా తీసింది. దీంతో ఇటీవల పలు సబ్సిడీలకు ప్రభుత్వం కోతలు పెడుతున్నది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను కూడా సమయానికి ఇవ్వలేదు. వేతనాలు ఆలస్యంగా ఇస్తే రాష్ర్టానికి నెలకు రూ.30 కోట్ల వడ్డీ మిగులుతుందని స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో చెప్పారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గంజాయి సాగు కొంతమేరకు గట్టెక్కిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. గంజాయి సాగుతో ఏడాదికి రూ.2,000 కోట్ల ఆదాయం రావొచ్చని గతంలో సీఎం సుఖు వ్యాఖ్యానించారు.
రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన హిమాచల్ కాంగ్రెస్ సర్కారు.. దాన్నుంచి బయటపడేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది. ఇప్పటికే పలు సబ్సిడీలకు కోతపెట్టిన సుఖ్విందర్ సుఖు ప్రభుత్వం.. తాజాగా విద్యుత్తు వినియోగంపై పాలు, పర్యావరణ సెస్‌లను విధించేందుకు సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి సుఖు ఈ మేరకు ‘ది హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ (డ్యూటీ) అమెండ్మెంట్ బిల్లు, 2024’ను శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ప్రజలు వినియోగించే ఒక యూ నిట్ విద్యుత్తుకు 10 పైసలు పాల సెస్ విధించాలని ప్రతిపాదించారు. చిన్నతరహా పరిశ్రమలు వినియోగించే ఒక్కొక్క యూనిట్ విద్యుత్తుకు 2 పైసలు చొప్పున, మధ్యతరహా పరిశ్రమలకు 4 పైసల చొప్పు న, భారీ పరిశ్రమలకు 10 పైసల చొప్పున సెస్ విధించాలని ప్రతిపాదించారు.