Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికలపై చేసే డ్యాన్స్ మూమెంట్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ట్రంప్ వేసే స్టెప్పులను చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ ట్రంప్ చేసే ఆ డ్యాన్స్ ఒక్కరికీ మాత్రం అస్సలు నచ్చదంట. ఆమె ఎవరో కాదు ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా. అవును.. ఇది నిజం. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌నే స్వయంగా బయటపెట్టారు. వాషింగ్టన్‌లోని కెన్నెడీ సెంటర్లో రిపబ్లికన్ చట్టసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందుగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మదురో నా డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. కానీ అతను చాలా హింసాత్మక వ్యక్తి.. లక్షల మందిని చంపేశాడని ఆరోపించారు. కారకాస్ మధ్యలోనే హింసాత్మక కేంద్రాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక తాను ఎన్నికల ర్యాలీలో వైఎంసీఏ పాటకు చేసే డ్యాన్స్ విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. నేను చేసే డ్యాన్స్ నా భార్యకు అస్సలు నచ్చదని బయటపెట్టారు. అధ్యక్షుడు ఇలా డ్యాన్స్ చేస్తే బాగోదని ఆమె చెబుతూ ఉంటుంది.. నిజంగా ఆమె చాలా క్లాస్ కదా.. అని సరదాగా నవ్వుతూ చెప్పారు.
ఈ కార్యక్రమానికి మెలానియా హాజరుకాలేదు. అయినప్పటికీ తనతో మెలానియా ఏవిధంగా చెబుతుంటూ అనుకరించి ట్రంప్ చూపించారు. అందరూ నా డ్యాన్స్‌ను చూడాలని కోరుకుంటారని తాను చెప్పగానే.. ” డార్లింగ్.. ఇది అధ్యక్షుడి హోదాలో ఉన్నవారికి తగదు” అని చెబుతూ మెలానియాను ట్రంప్ ఇమిటేట్ చేశారు. ఇది కాస్త సభలో నవ్వులు పూయించింది. అలాగే ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన తాను చేసే హావభావాలు కూడా మెలానియాకు నచ్చవని ట్రంప్ తెలిపారు. అది చాలా దారుణంగా ఉంటుందని మెలానియా చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే మెలానియా చేసే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని.. నా డ్యాన్స్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పానని అన్నారు. కానీ తన మాటలను మెలానియా కొట్టిపారేస్తారని చెప్పారు. నా డ్యాన్స్ ఎవరికీ నచ్చదని.. కేవలం మర్యాద కోసమే అలా నవ్వుతారని చెబుతుందని అన్నారు.