Sakshi Vaidya | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు మొదటి నుంచే భారీగా ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో హీరోయిన్గా సాక్షి వైద్య పేరు బలంగా వినిపించింది. అనంతరం ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో తాజాగా సాక్షి వైద్య ఈ అంశంపై స్పందించింది.
ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి, సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలలో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బయటకు రావడంపై ఆమె స్పష్టత ఇచ్చింది. సాక్షి మాట్లాడుతూ, తన గత చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదన్న కారణంతోనే తనను సినిమా నుంచి తొలగించారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. అసలు కారణం డేట్స్ సమస్య మాత్రమేనని వెల్లడించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ డేట్స్ చాలా తక్కువగా, అకస్మాత్తుగా ఫిక్స్ అవుతాయని ఆమె చెప్పింది.
అలాంటి సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి తక్షణమే షూటింగ్‌కు రావాలని కాల్ వచ్చిందని, అయితే కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వారం రోజుల పాటు అందుబాటులో లేకపోయానని తెలిపింది. ఆ కారణంతోనే ఆ ప్రాజెక్ట్ తన చేతుల నుంచి జారిపోయిందని వివరించింది. తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకోవడం సహజమైన ప్రక్రియేనని చెప్పిన సాక్షి, భవిష్యత్తులో మళ్లీ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోనని పేర్కొంది. ఇప్పటికే తాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పని చేశానని, ఆయనే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారని చెప్పింది. ఆ అనుభవం తనకు మంచి గుర్తుగా నిలిచిందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.